జిల్లా పరిషత్‌లలో భగ్గుమన్న అసంతృప్తి.. పదవుల పంపకాలలో రగడ
కడప జెడ్పీ చేజారడంతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా బెదిరింపులు
తాను తలుచుకుంటే క్షణాల్లో సమీకరణాలు మారతాయని హెచ్చరికలు
కాకినాడలో ప్రమాణం చేయకుండానే వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
పార్వతీపురంలో మన్యంలో కురుపాం కోట గేట్లకు తాళాలు.. సొంత ఎమ్మెల్యేనే అడ్డుకున్న టీడీపీ క్యాడర్
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనకాపల్లిల్లోనూ అసమ్మతి సెగలు
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు కూటమిలో చిచ్చు రేపాయి. పంపకాల్లో తేడా రావడంతో నాయకులు రచ్చకెక్కారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అసమ్మతి సెగలు ఎగసిపడ్డాయి. జెడ్పీ సమావేశ మందిరాలు కూటమి నేతల కుమ్ములాటలకు వేదికలయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పొత్తు ధర్మం అంటూ గొప్పలుపోయిన కూటమి పెద్దల అసలు రంగు బయటపడిపోయింది.
నెల రోజులుగా ఆశావహులను తిప్పుకుని, హామీల మీద హామీలు గుప్పించి చివరకు బేరాలకు లొంగిపోవడంతో నాయకులు భగ్గుమన్నారు. కడపలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అయితే ఏకంగా రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. కాకినాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జెడ్పీటీసీగా ప్రమాణం చేయకుండానే సమావేశం నంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కార్యకర్తలు సొంత ఎమ్మెల్యేనే అడ్డుకున్నారు.
కడపలో ‘ఆది’ తిరుగుబాటు
కడప జెడ్పీ పీఠం బీజేపీకేనని కూటమి పెద్దలు ముందు నుంచీ చెబుతూ వచ్చారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(ఆది) తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డి కోసం పట్టుబట్టారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కడపలో రాకరాక వచ్చిన పీఠాన్ని బీజేపీకి ఇవ్వడం ఏమిటని అడ్డం తిరిగారు. దీంతో చివరి నిమిషంలో బీజేపీకి ఇస్తానన్న ఆ ఒక్క పీఠాన్ని కృష్ణా జిల్లాకు మార్చారు. కడపను టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఆది భగ్గుమన్నారు.
కడపలో జరిగే ఎన్నికకు హాజరుకాకుండా అనుచరులతో కలిసి రాత్రికిరాత్రే విజయవాడ చేరుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హడావుడి చేయడంతో బీజేపీలో కలకలం రేగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బుజ్జగించినా ఆది వెనక్కి తగ్గలేదు. ‘జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. ఎవరు లాబీయింగ్ చేస్తే మాట తప్పారో తెలియాలి. ముందు హామీ ఇచ్చి తర్వాత ఇలా చేయడం ఎందుకు? రాత్రికిరాత్రే పరిస్థితులు మారిపోయాయి.
కూటమి కోసం నిబద్ధతతో పనిచేశా.ఎమ్మెల్యే పదవి నాకు గొప్ప కాదు. నేను తలుచుకుంటే క్షణాల్లో సమీకరణాలు మారతాయి. రాజకీయంగా మార్పులుచేర్పులు చేయాలనుకుంటే నాకు అర సెకను కూడా పట్టదు. నా నిర్ణయం రేపు ప్రకటిస్తా‘ అని ఆయన తేల్చిచెప్పారు. వెంటనే ఆయన సోదరుడి కుమారుడు జమ్మలమడుగు జెడ్పీటీసీ సభ్యుడు చదిపిరాళ్ల రాజేష్ రెడ్డి, ఆయన సోదరుడు, ముద్దనూరు జెడ్పీటీసీ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తామని చెప్పి ఎన్నికకు గైర్హాజరయ్యారు.
కాకినాడలో అనంతలక్ష్మి వాకౌట్
కాకినాడ జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తనకు ఇస్తానని చెప్పి జనసేనకు కేటాయించడంపై ఆగ్రహంతో ఆమె ఎన్నికకు రాలేదు. కొందరు ముఖ్య నేతలు ఆమెను బతిమలాడి జెడ్పీకి తీసుకువచ్చినా ఆమె వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయకుండా వెళ్లిపోయారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తనను వైస్ చైర్‌పర్సన్ పదవితో సర్దుకోమనడం అవమానించడమేనని ఆమె ఆగ్రహంతో రగిలిపోయారు.
పార్వతీపురం మన్యంలో గేట్లకు తాళాలు
పార్వతీపురం మన్యం జెడ్పీ పీఠాన్ని కురుపాం జెడ్పీటీసీ వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు ఇస్తామని చెప్పి ఇప్పుడు జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎన్నికకు వెళ్లవద్దంటూ చంద్రదేవ్‌ను అడ్డుకుని ఆయన కోట గేట్లకు తాళాలు వేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరిపై తిరగబడి ఆమెను నిలదీశారు. కురుపాం కోటకు వస్తున్న ఆమెను అడ్డుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యకర్తల ఆగ్రహంతో ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది.
మంత్రి ఆనం అలక
నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎంపికలో తన మాటకు విలువ ఇవ్వలేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అలిగారు. ఎంపీ వేమిరెడ్డి దంపతుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం అయ్యేవరకు ఉండకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలూ వేమిరెడ్డి తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
జనసేనకు మొండిచేయి
పొత్తులో తొమ్మిది జెడ్పీ చైర్మన్ పదవులు కావాలని జనసేన కోరినా చంద్రబాబు నాలుగుతో సరిపెట్టారు. శ్రీసత్యసాయి పీఠం కోసం గట్టిగా యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో జనసేన శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. మరోవైపు జనసేనకు ఇచ్చిన నాలుగు జిల్లాల్లోనూ టీడీపీ ఆశావహులు భగ్గుమంటున్నారు.
అన్ని జిల్లాల్లోనూ అసమ్మతి సెగలు
అనకాపల్లి పీఠం జనసేనకు చెందిన మోటూరు నాగమణికి దక్కింది. పదవి ఆశించిన టీడీపీ నేతలు కిలపర్తి రాజేశ్వరి, సుకల రమణమ్మ జీర్ణించుకోలేక రగిలిపోతున్నారు. మరోవైపు జిల్లాకు వైస్ చైర్మన్ పదవి కూడా తేలేకపోయారంటూ ఎంపీ సీఎం రమేష్ పై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో మేయర్ పదవి ఇప్పటికే జనసేనకు దక్కింది. జెడ్పీ అయినా తమకు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు పట్టుబట్టినా పీఠం జనసేనకే వెళ్లింది.
చిత్తూరు జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా పూతలపట్టు జడ్పీటీసీ శైలజను ఖరారు చేయడంతో పదవి ఆశించిన సుచిత్ర, జాహ్నవి, మమతశ్రీ అసమ్మతి గళం విప్పారు. మంత్రి లోకేశ్ అండ ఉన్నవారికి, పార్టీకి ఫండ్ ఇచ్చినవారికే పదవులు కట్టబెట్టారని విధేయులను పక్కనపెట్టారని వారు మండిపడుతున్నారు. తిరుపతి పీఠాన్ని తన కుమార్తె డాక్టర్ పనబాక చేతనకు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంపై కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా ఆగ్రహంగా ఉన్నారు.


