విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజాస్వామ్యానికి పాతరేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇప్పుడు చేసిన నీచమైన అరాచకం ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అరాచకంతో వచ్చిన గెలుపును చూసి చంద్రబాబు సంబరపడిపోతున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘రాబోయే రోజుల్లో ఏదైనా జరిగితే అది మీరు తీసుకొచ్చిన సంప్రదాయమే కారణం అవుతుంది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీపీ, వైస్ ఎంపిపిలు గెలిచినట్లు ప్రకటించారు. పూసపాటి రేగ మండలంలో మహంతి శ్రీనివాసరావు వైస్ ఎంపిపిగా గెలిచినట్లు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. ఎన్నిక అంతా అయిన తరువాత మళ్లీ ఎన్నిక పెట్టారు.
ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేశారు. స్వయంగా ఎమ్మెల్యే లోకం మాధవి, ఆమె భర్త ఎన్నికల అధికారులు పై బెదిరింపులకు దిగారు. రేపు సాయింత్రం నాలుగు గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాంజరిగిన అన్ని ఘటనలు గవర్నర్‌కి వివరిస్తాం. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ రకంగా కూడా ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. పరిస్థితులు చూస్తే అసహ్యం వేస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన కూటమి సర్కారు


