సాక్షి,తిరుపతి: జిల్లా పరిషత్ (జడ్పీ) తొలి చైర్‌పర్సన్ పదవి కేటాయింపులో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన కుమార్తె డాక్టర్ పనబాక చేతనకు తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. కూటమి నేతల కసరత్తు అనంతరం చేతనను పక్కన పెట్టి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, నాగలాపురం జెడ్పీటీసీ హేమలతను తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనబాక లక్ష్మి నాలుగుసార్లు ఎంపీగా, 2004 నుండి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. 2019 సాధారణ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంపీ గురుమూర్తిపై పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా అవకాశం దక్కింది.
అయినప్పటికీ, ఆమె ఉన్నత స్థాయి రాజకీయ అనుభవానికి తగినంత గుర్తింపు ఇంకా దక్కలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే పనబాక లక్ష్మి కుమార్తె చేతనకు జిల్లా స్థాయిలో అత్యున్నతమైన జడ్పీ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టడం ద్వారా పనబాక కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవడానికి టీడీపీ పావులు కదిపింది. కానీ, ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి, చేతన అభ్యర్థిత్వాన్ని పక్కనబెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ అభ్యర్థిగా పనబాక చేతన తీవ్రంగా ప్రయత్నించారు. రాజకీయాల్లో పనబాక లక్ష్మికి ఉన్న స్థాయి, విస్తృత అనుభవం, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని చేతనకు అవకాశం ఇవ్వాలని మద్దతుదారులు అధిష్టానాన్ని కోరారు. తొలుత సమీకరణలు చూస్తుంటే చేతనకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఊహించినట్లుగానే టీడీపీ అధిష్టానం పనబాక చేతనను పక్కన పెట్టింది.
దీంతో చేతనకు పదవి దక్కుతుందన్న ఆశలు, మద్దతుదారుల విజ్ఞప్తులు ఉన్నప్పటికీ, తుది జాబితాలో హేమలత పేరును టీడీపీ ప్రకటించడం పనబాక లక్ష్మి వర్గానికి షాక్ కలిగించింది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా తిరుపతి జడ్పీ వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. ఇచ్చి మాట తప్పి, సీనియర్ నేత కుటుంబానికి అన్యాయం చేయడం ద్వారా టీడీపీ మరోసారి తన అవకాశవాద రాజకీయాలను బయటపెట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో తిరుపతి జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది.


