దివిసీమ ఉప్పెన – నా జ్ఞాపకాలు | 1977 Diviseema Cyclone in AP Memories by Bandaru Dattatraya | Sakshi
Sakshi News home page

దివిసీమ ఉప్పెన – నా జ్ఞాపకాలు

Nov 20 2026 3:49 PM | Updated on Nov 20 2026 3:59 PM

1977 Diviseema Cyclone in AP Memories by Bandaru Dattatraya

1977 నవంబర్‌ 19 దివిసీమ ఉప్పెన : ప్రాంతాన్ని దివిసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన పెను ఉప్పెన నా జీవితంలో ఎప్పటికీ మరచి పోలేని అనుభవం. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. తాగునీరు, ఆహారం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 49 సంవత్స రాల క్రితం జరిగిన ఆ మహా విషాదం కళ్లముందు కదలాడుతుంది. 

ఆ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రాంత ప్రచా రక్‌ సోంపల్లి సోమయ్య గారి సూచనల మేరకు కొంతమంది స్వయంసేవకులం నవంబర్‌ 21వ తేదీన అవనిగడ్డ ప్రాంతానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఎటుచూసినా జన జీవనం ఛిన్నాభిన్నమైపోయి, ఆ ప్రాంతమంతా మరుభూమిని తల పించేది. గుర్తుపట్టలేని స్థితిలో కుప్పలుగా మృతదేహాలు కనిపించేవి. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు సైతం ముందుకు రాలేని పరిస్థితి. వాటికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వ హించాల్సిన బాధ్యతను మేము స్వీకరించాం. ప్రతి మృతదేహాన్ని వెదురు కర్రలతో కట్టి, నలుగురం భుజాలపై మోస్తూ, రామనామ స్మరణ చేస్తూ తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేవాళ్లం. దాదాపు పది రోజుల పాటు అందుబాటులో ఉన్న పాలు, కొన్ని బిస్కెట్లు తింటూ ఈ కార్యక్రమాలను కొనసాగించాం. ఈ సేవా కార్యక్రమాలను పత్రికలు ప్రత్యేకంగా గుర్తించి ‘శవసేన’ పేరుతో ప్రచురించాయి.

‘శవసేన’కు వెంగళరావు ప్రశంస
సహాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు అప్పటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు కోడూరు ప్రాంతానికి వచ్చారు. ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా ధరించి ఉన్న మమ్మల్ని ‘‘మీరు పోలీసులా?’’ అని అడిగారు.  స్వయంసేవకులమని చెప్పాం. ‘మృతదేహాలను చూసి పోలీసులు, సింగరేణి నుండి వచ్చిన సహాయక సిబ్బందే హడలిపోతుంటే మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీకు ఏమైనా మత్తు అలవాటు ఉందా?’ అని అడిగారు. మాకు ఎలాంటి మత్తు పదార్థాల అలవాటు లేదు, సమాజ సేవ అనే భావనను సంస్థ మాలో నింపింది అని చెప్పాం. ఎంతో సంతోషించిన ఆయన మా సహాయ కార్యక్రమాలకు అవసరమైన కిరోసి¯Œ , ఇతర సామగ్రిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

అవనిగడ్డ శాసనసభ్యులు, అప్పటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు గ్రామగ్రామాన తిరుగుతూ బాధిత ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మేము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలిసి, మమ్మల్ని గాంధీ క్షేత్రానికి ఆహ్వానించి ప్రశంసించారు. అక్కడే ఉన్న మహారాష్ట్రకు చెందిన గాంధేయవాది ప్రభాకర్‌జీ ‘ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే రెడీ ఫర్‌ సెల్ఫ్‌లెస్‌ సర్వీస్‌’ అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు మాలో ఉత్సాహాన్ని నింపాయి.  దివిసీమలో సహాయ చర్యలతో పాటు బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించడం అవసరమని భావించాం. ఈ క్రమంలో మూలపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, పునర్నిర్మాణ బాధ్య తను చేపట్టాము. గ్రామస్థుల సహకారంతో ఇళ్ల నిర్మాణం, పాఠ శాల, రహదారులు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేశాం. మత్స్యకారులకు పడవలు, వలలు అందించి వారి జీవనోపాధి తిరిగి ప్రారంభమయ్యేలా చేశాం. మూలపాలెం దీన్‌దయాల్‌ పురంగా పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం జరిగిన ప్రారంభోత్సవానికి అప్పటి విదేశాంగ శాఖ మంత్రి, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విచ్చేయడం మాకు ఎంతో గర్వకారణం. 

ఈ పునరావాస కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌ తుపాను సహాయ కమిటీతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు అందాయి. విజయవాడలోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గోదాములో సేకరించిన సహాయ సామగ్రిని క్రమబద్ధీకరించి సుమారు 56 గ్రామాలకు పంపిణీ చేశాం. దాదాపు 400 నుంచి 500 మంది స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామ కృష్ణ మిషన్‌ సత్యసాయి సేవా సంస్థలు, ఆర్యసమాజ్, విశ్వహిందూ పరిషత్, సాల్వేష¯Œ  ఆర్మీ తదితర సంస్థలు తమ వంతు సహకారం అందించాయి. దివిసీమ ఉప్పెన నాకు నేర్పిన గొప్ప పాఠంఒక్కటే– ఆపదలో ఉన్న మనిషికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

 ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించేది. ప్రతి మృతదేహాన్ని వెదురు కర్రలతో కట్టి, నలుగురం భుజాలపై మోస్తూ, రామనామ స్మరణ చేస్తూ తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేవాళ్లం.

  • - బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement