చంద్ర‌బాబు డాంబికాలు | Kommineni Srinivasarao on Chandrababu Sunlight Even at Night Remark | Sakshi
Sakshi News home page

బాబు డాంబికాలు.. నవ్వులపాలు!

Nov 20 2026 12:46 PM | Updated on Nov 20 2026 12:46 PM

Kommineni Srinivasarao on Chandrababu Sunlight Even at Night Remark

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంతో సీనియర్ అయినప్పటికీ, ఆయన చేసే ప్రసంగాలు, చెప్పే విషయాలు కొన్నిసార్లు అందరిని విస్మయపరుస్తుంటాయి. అవి తనకు అప్రతిష్ట తెస్తాయని తెలిసినా, ఆయన తన ధోరణి మార్చుకోరు. ప్రతి రంగంలో తనకు ప్రావీణ్యం ఉందనుకోవాలన్న తాపత్రయంతో  కొన్నిసార్లు నవ్వులపాలవుతుంటారన్న అభిప్రాయం రాకీయవర్గాలలో నెలకొంది.

విశాఖ భాగస్వామ్య సదస్సులో ఆయన చేసిన విన్నూత్న ప్రకటన వేదికపైన ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా అర్ధం అయినట్లు అనిపించలేదు. అంతరిక్షం నుంచి లేజర్ టెక్నాలజీ ద్వారా రాత్రిపూట కూడా సూర్యకాంతి వచ్చే ప్రక్రియ రాబోతోందని ఆయన చెప్పారు. ఆ ప్రసంగం వింటున్న కొందరు ప్రముఖుల ముఖ కవళికలు గమనిస్తే వారు ఆశ్చర్యపోతున్నట్లు  అనిపించింది. ఆయనకు ఎవరో కంపెనీవారో, లేక ఏ అధికారో దీని గురించి ఏమి చెప్పారో తెలియదు. ఆయనకు ఎంత అర్ధం అయిందో తెలియదు. ఏదో చెప్పేశారు.

అమెరికాలో ఒక కంపెనీ చేసిన ఒక ప్రయోగాన్ని తన అకౌంట్‌లో వేసుకునే క్రమంలో ఈ  ప్రసంగం చేశారని చెబుతున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. ఆయనకు ఉన్న ఆంగ్ల భాషా ప్రావీణ్యం అంతంతమాత్రమే. అదేమి తప్పుకాదు. అలాంటప్పుడు ఆయన ముందుగా తన భావాలకు అనుగుణంగా అధికారులతో స్పీచ్ రాయించుకుని, దానిని చదివితే బాగుంటుంది. కాని ఆయన అలా చేయరు. సరైన గ్రామర్‌తో నిమిత్తం లేకుండా ఆంగ్లంలో  సంభాషించడంతో అది ఆయనకు ప్రతిష్ట తేవడం లేదు. రాష్ట్రానికి కూడా అంత శోభనివ్వదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక ఎవరూ దాని గురించి అక్కడ వ్యాఖ్యానించకపోవచ్చు. సభ పూర్తి అయ్యాకైనా తమలో తాము ఈ సంగతి మాట్లాడుకోకుండా ఉండరు కదా!

సూర్యకాంతి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన  గతంలో చేసిన అలాంటి చిత్ర, విచిత్ర ప్రకటనలన్నిటిని ఉదహరిస్తూ మీడియాలో కథ‌నాలు వచ్చాయి. ఈ మధ్యనే తాను ప్రార్ధన చేస్తే విశాఖలో వర్షం కురిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఇలాంటి అసందర్భ ప్రసంగాలు చేయకూడదు. కాని జనం నమ్ముతారులే అనుకునో, లేక ఎల్లో మీడియా అండ ఉందిలే అనుకునో కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఆయన వర్షం గురించి అలా అన్న తర్వాత ఏపీకి రెండుసార్లు తుపాన్లు వచ్చాయి. వాటివల్ల రైతులకు చాలా నష్టం వాటిల్లింది. ప్రజలు నానా పాట్లు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రార్థన చేసి తుపాను ఆపి ఉండవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అలాగే కరువు సమయంలో ఎందుకు ఆ ప్రార్ధన చేయలేదని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పటికీ రాయలసీమలోని పలు ప్రాంతాలలో కరువు వల్ల పంటలు దెబ్బతిన్నాయి.

చంద్రబాబు ఎప్పుడు ఏది జరిగినా అది తనకు ఉపయోగం అనుకుంటే తన ఖాతాలో వేసేసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చారని ఆయన చెప్పుకోవడం అతిశయోక్తి కాదా! అసలు నామినేషన్ల మొదలు ఫలితాల వెల్లడి వరకు రిగ్గింగ్ చేసి ఎన్నికల అక్రమాలలో కొత్త ట్రెండ్ సృష్టించిన చంద్రబాబు సర్కార్ అదేదో గొప్ప రిజల్ట్ అని ప్రచారం చేసుకుంటే వాస్తవాలు తెలియకుండా పోతాయా? మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ ఎన్నికల అక్రమాల గురించి నిలదీశారు. దానికి జవాబు ఏది. ఇది ఒక ఎత్తు అయితే అల్లూరి జిల్లా పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ గెలవడంపై మాట్లాడుతూ మత మార్పిడుల ప్రస్తావన తేవడం దారుణంగా ఉంది. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ అంశంలో చంద్రబాబుపై మండిపడ్డారు. మత మార్పిడుల కారణంగా కూటమి ఓడిపోయిందని ముఖ్యమంత్రి అనడం బాధ్యతారాహిత్యమని, మత ఎజెండాతో ముందుకు వెళుతున్నట్లు ఉందని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ ఏ పెద్ద నేత చంద్ర‌బాబులా ఇలాంటి  విశ్లేషణ చేయలేదు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంట తగ్గించాలని చెబితే ఫర్వాలేదు. అలాకాకుండా వరి పంటలో యూరియా వాడకం వల్ల కాన్సర్ వస్తుందంటూ ఆ మధ్య ప్రసంగం చేశారు. తాజాగా బియ్యం వల్లే షుగర్ వస్తుందని చంద్రబాబు అన్నారు. 90 శాతం పైగా ప్రజలు బియ్యం తింటుంటే,అది తినవద్దని సీఎం చెబితే జనం ఏమి చేయాలి? బియ్యం బదులు ఏమి తినాలి? మిల్లెట్లు వంటివి ఎంతమంది తినగలరు? ఒక వైద్యుడి మాదిరి షుగర్ వస్తుందని చెప్పేస్తే జనాన్ని భయపెట్టడమే అవ్వదా! పంచదార వినియోగం తగ్గడం వల్ల చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మరి చక్కెర అధికంగా తింటే షుగర్ రాదా అన్న ప్రశ్నకు బదులు ఏమి ఉంటుంది? ఉద్యానవనాలు, ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఆ పంటలకు ఉండే పరిమితులు ఆయనకు తెలియవా? వాటికి కూడా మార్కెటింగ్ సమస్య ఏ స్థాయిలో ఉంది ఇప్పటికే  తెలుసు కదా!

ఇదీ చ‌ద‌వండి: రామోజీకి ఇంతటి గౌరవం ఎందుకు బాబూ?

పాతికేళ్ల క్రితం ఏపీకి స్వీడన్  మంత్రి వచ్చినప్పుడు రాష్ట్రం గ్రోత్ రేట్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూసి తమ దేశంలో ఇలా లెక్కలు చెబితే... అంటూ చేసిన వ్యాఖ్య పెద్ద సంచలనం అయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఆయా ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేక షో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామంలో ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి వంట చేస్తున్నట్లు  కనిపించడం, అక్కడ స్టవ్ వెలిగించకుండానే గరిట తిప్పడం వంటివి సోషల్ మీడియాలో సెటైర్లుగా మారాయి.  

గతంలో అనంతపురంలో కరువును తీర్చడానికి రెయిన్ గన్ లు తీసుకువచ్చానని హడావుడి చేశారు. కాని ఈ టర్మ లో ఆ రెయిన్ గన్‌లను ఏమి చేశారో తెలియదు. రాయలసీమలో అనేక చోట్ల కరువు బారిన పడి చీని చెట్లు కూడా ఎండిపోయాయి. బులెట్ రైలులో ప్రయాణం, హైపర్ లూప్, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తాం, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకువస్తే నోబెల్ బహుమతి, అమరావతిలో అందరికి ఏసీ సదుపాయం, అమరావతిలో ఎండ వేడిని పది డిగ్రీలు తగ్గించాలని అధికారులను ఆదేశించా, హైదరాబాద్, సైబరాబాద్ నేనే నిర్మించా.. సెల్ పోన్లు నేనే  తెచ్చా.. ఇలాంటి చిత్ర, విచిత్రమైన ప్రకటనలు దేశంలో మరే ముఖ్యమంత్రి చేసి ఉండరు.

ఇదీ చ‌ద‌వండి: ట్రంప్‌కు.. చంద్రబాబు పాఠాలు!

సోషల్ మీడియా వచ్చాక ఇవన్ని చర్చనీయాంశాలు అవుతున్నాయి కాని, ఎల్లో మీడియా అండతో అంతా పాజిటివ్ గానే ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చారు. కాలం మారుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా తాటాకులు కట్టేసే రోజులివి. వయసు రీత్యా కూడా ఆయన పెద్దవారు. అందువల్ల తను చేసే వ్యాఖ్యలు అర్దవంతంగా, నమ్మశక్యంగా ఉండేలా చూసుకుంటే మంచిది కదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement