ట్రంప్‌కు.. చంద్రబాబు పాఠాలు! | KSR's Comments On Chandrababu Trump Election Controversy | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు.. చంద్రబాబు పాఠాలు!

Nov 10 2026 11:11 AM | Updated on Nov 10 2026 11:13 AM

KSR's Comments On Chandrababu Trump Election Controversy

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఎన్నికల మేనేజ్‌మెంట్‌పై పాఠాలు చెప్పవచ్చేమో!. అమెరికా కాంగ్రెస్, సెనేట్‌లకు జరిగిన ఎన్నికలలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలైంది. ఇదే టైమ్‌లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలిచింది.

దీనిపై సోషల్ మీడియాలో కాని, కొంతమంది వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కాని వ్యాఖ్యలు చేస్తూ అమెరికాలో ఎన్నికల కమిషన్ ఏపీలో మాదిరి పనిచేయలేదని, పోలీసులు అధికార పార్టీకి సహకరించలేదని, రిపబ్లికన్ పార్టీ రిగ్గింగ్ చేయలేకపోయిందంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇది చంద్రబాబుకు కాస్త ఇబ్బందిగా మారింది. దానికి ప్రతిగా చంద్రబాబు ఎదురుదాడి వ్యూహంలోకి వెళ్లారు. ఆయనకు ఈ లక్షణం మొదటి నుంచి ఉన్నదే.

ప్రపంచంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, అది నెగిటివ్ అయ్యేది అయితే వెంటనే తన ప్రత్యర్ధులకు పులిమేస్తుంటారు. పాజిటివ్ అయితే తన ఖాతాలో వేసుకుంటారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడుగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయాలలోకి వచ్చి, అనూహ్య పరిణామాలలో సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఈ ధోరణిని మరీ తీవ్రం చేశారు. జగన్‌పై పలు అరోపణలు చేస్తూ ఆయనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి విశ్వయత్నం చేశారు. దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా బాజా వాయించి చంద్రబాబుకు మద్దతుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

వీటన్నిటిని తట్టుకుని 2019లో వైఎస్‌ జగన్ సీఎం కాగలిగారు. అప్పటి నుంచి చంద్రబాబు, ఎల్లో మీడియా మరింతగా రెచ్చిపోతూ జగన్‌పై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తూ దాడి కొనసాగిస్తున్నారు. 2024లో వైఎస్సార్‌సీపీని కుట్రతో ఓడించినా, జగన్ బలం చూసి కూటమి నేతలు భయపడుతుంటారు. ఈ నేపధ్యంలో ఆయనపై ఎంత దారుణమైన వ్యాఖ్యలు చంద్రబాబు చేస్తుంటారో చెప్పలేం. 

ఉదాహరణకు కొలంబియాలో మాదకద్రవ్యాల మాఫియాగా పేరొందిన ప్లాబో ఎస్కోబార్‌తో జగన్‌ను పోల్చుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటే ఏమనుకోవాలి? ఇంత సీనియర్ అయి ఉండి ఇలా అనుచిత విమర్శలు చేయవచ్చా అంటే ఏమి చెబుతాం. ఆయన తత్వమే అంత అని సరిపెట్టుకోవడం తప్ప. జగన్ వీటిని పట్టించుకోవడం లేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంద్రబాబుకు కూడా అంతర్జాతీయంగా లింక్‌లు పెట్టి విమర్శలు చేసి ఉండేవారు.

చంద్రబాబుది రెచ్చగొట్టే వ్యూహం. ఆయన ఎదుటివారిని నానా రకాలుగా దూషిస్తారు. దానికి ప్రతిగా ఎవరైనా స్పందించి అదే స్థాయిలో దూషిస్తే, ఇంకేముంది.. నన్ను తిట్టారు.. అయినా తాను ప్రజల కోసం పడతానని కొత్త అంకంలోకి వెళతారు. ఇలాంటి ఘట్టాలు ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

ఇదీ చదవండి: గెలుపు కాదు అరాచకం

ఇక ట్రంప్ విషయానికి వస్తే, చంద్రబాబు ఏమన్నారో గమనించండి.. "ఈ రోజు అమెరికాలో ఏమి జరిగిందో చూశారు కదా.. ఎక్కడైనా భరించి, భరించి విసుగు వచ్చాక వదలించుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా అంతే.. ఆంధ్రలో జరిగిన ఎక్స్‌పెరిమెంట్ అమెరికాలో కూడా జరిగింది." అని ఆయన అన్నారు. ఇక్కడ చిత్రమేమిటంటే స్థానిక ఎన్నికలలో ఎంత హింస జరిగింది, కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాలు, రౌడీల అవతారం ఎత్తి ఎంత అరాచకం సృష్టించింది ప్రజలంతా చూశారు. అయినా ఆయన ధైర్యంగా అదేదో ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలన్నట్లుగా పిక్చర్ ఇస్తారన్నమాట.

మరో సంగతి చెప్పాలి... చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ 2004, 2009, 2019లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందింది. అలాగే స్థానిక ఎన్నికలలో కూడా విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పరాజయం పాలైంది. అయినా అవేవి జరగనట్లుగా చంద్రబాబు కామెంట్లు చేస్తుంటారు. చంద్రబాబు ధీరి ప్రకారం టీడీపీ ఓడిపోయినప్పుడల్లా... ప్రజలు విసిగి వదలించుకున్నట్లు ఆయన ఒప్పుకోవాలి కదా! కాని అప్పుడు మాత్రం ఎన్నికలలో అక్రమాలు జరిగాయనో, ఈవీఎమ్‌ల మోసం అనో ఆరోపణలు చేస్తుంటారు. లేదా ప్రజలే తప్పు చేశారని చెబుతారు.

2024 అసెంబ్లీ ఎన్నికలలో 50 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్న మిస్టరీ ఇంతవరకు వీడలేదు. బహుశా దానిని ప్రామాణికంగా తీసుకున్నారేమో తెలియదు కాని, స్థానిక ఎన్నికలలో గెలవడానికి అదే మార్గాన్ని ఎంపిక చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు చేయడంలో కొత్త, కొత్త పద్దతులను తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబు అండ్ కో కే దక్కుతుందేమో!

ఇందులో బీహారు వంటి రాష్ట్రాల చెత్త రికార్డును సైతం దాటేయడం కూడా విశేషం. నామినేషన్లను అడ్డుకోవడం నుంచి కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఫలితాలను సైతం రిగ్ చేసి టీడీపీకి అనుకూలంగా ప్రకటించే దశ వరకు ఏపీ వెళ్లింది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఈసారి జరిగిన స్థానిక ఎన్నికలు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు... వెనుజులా, ఇరాన్‌లపై దాడులు చేసి, చేసి... విధ్వంసాలకు పాల్పడితే, ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజలపైనే హింసాకాండకు పాల్పడింది. పోలీసులను పలు చోట్ల టీడీపీ కార్యకర్తలుగా మార్చివేశారు. డీజీపీ ఏపీకి ఉన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేలా పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే టీడీపీకి బ్రాంచ్ ఆఫీస్‌గా మారిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. దానికి తగినట్లే రిగ్గింగ్ చేసినవారిపై కేసులు పెట్టలేదు. అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారులపైకాని, ఎన్నికల అధికారులపైకాని ఒక్కరిమీద కూడా కేసులు పెట్టలేదు. మరి అమెరికాలో స్వేచ్చగా ఎన్నికలు జరిగాయి కనుక తమ అభిప్రాయాన్ని ప్రజలు నిర్భయంగా వ్యక్తం చేశారు. ఏపీలో మాత్రం నియంతృత్వ పోకడలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అయినా చంద్రబాబు రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ ఓటమిని వైఎస్సార్‌సీపీకి ఆపాదించి వ్యాఖ్యలు చేసి, తనపై వచ్చిన విమర్శలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. అదే ఆయన విశిష్టత. 

నామినేషన్ మొదలు, కౌంటింగ్ వరకు ప్రతి ప్రక్రియలోను రిగ్గింగ్ చేసే సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం చంద్రబాబుదే. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాలి. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేరొందిన చంద్రబాబు రిగ్గింగ్, తదితర అక్రమాలు ఎలా చేయాలన్నదానిపై ట్రంప్‌కు, రిపబ్లికన్ పార్టీకి పాఠాలు నేర్పుతారేమో అని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కూడా గొప్పదనంగానే తెలుగుదేశం భావిస్తుందా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement