డిప్యూటీ మేయర్‌ పీఠంపై కూటమిలో కుంపట్లు! | kutami Leaders Fight In Deputy Mayor seat | Sakshi
Sakshi News home page

డిప్యూటీ మేయర్‌ పీఠంపై కూటమిలో కుంపట్లు!

Nov 10 2026 11:10 AM | Updated on Nov 10 2026 11:10 AM

kutami Leaders Fight In Deputy Mayor seat

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమికి ఇప్పుడు డిప్యూటీ మేయర్‌ పదవి ఎంపిక తలనొప్పిగా మారింది. మేయర్‌ పీఠాన్ని టీడీపీ దక్కించుకున్న నేపథ్యంలో.. డిప్యూటీ మేయర్‌ పదవి తమకంటే తమకంటూ జనసేన, బీజేపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు సామాజిక సమీకరణాలు కూడా తెరపైకి రావడంతో కూటమిలో పదవుల పంచాయితీ రసవత్తరంగా మారింది. 

జనసేన, బీజేపీ పోటాపోటీ! 
జీవీఎంసీలో కూటమి 98 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో జనసేన, బీజేపీ కీలక పాత్ర పోషించాయి. దీంతో అధికారంలో భాగస్వాములైన తమకు కూడా కీలక పదవి ఇవ్వాలని జనసేన కార్పొరేటర్లు కోరుతున్నారు. కూటమిలో తామూ భాగస్వాములమేనని, డిప్యూటీ మేయర్‌ పదవి తమకు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్లు సైతం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై కూటమి నేతల్లో చర్చ మొదలైంది. 

యాదవులకే ఇవ్వాలంటూ డిమాండ్‌ 
జనసేనకు డిప్యూటీ మేయర్‌ పదవి కేటాయిస్తే యాదవ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలతోపాటు సామాజికవర్గాల డిమాండ్లూ ఎంపికపై ప్రభావం చూపే అవకాశముంది. 

జనసేనలో ముగ్గురు ఆశావహులు 
జీవీఎంసీలో జనసేనకు 26 మంది కార్పొరేటర్లు ఉండగా.. వారిలో ముగ్గురు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు డిప్యూటీ మేయర్‌ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. 26వ వార్డు కార్పొరేటర్‌ ముగడ వెంకటలక్ష్మి, 31వ వార్డు కార్పొరేటర్‌ మన్యాల శ్రీనివాస్, 95వ వార్డు కార్పొరేటర్‌ కోన రాధిక పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్‌ పదవి మహిళకు దక్కిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌గా మన్యాల శ్రీనివాస్‌కు అవకాశం కల్పించాలని కొందరు కార్పొరేటర్లు కోరుతున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి గంకల అప్పారావు ఈ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్‌ పదవి టీడీపీకి దక్కడంతో మిత్రపక్షాలకు ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన, బీజేపీల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారు? సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారా? లేక రాజకీయ సమతూకానికే మొగ్గుచూపుతారా? అన్నది ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చగా మారింది.   

ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నాలెజినోవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement