ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జయంతిని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పండగగా పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల అయ్యాయి. నవంబర్ 16న రామోజీ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఆయన గొప్పదనాన్ని కీర్తించారు. అంతవరకు ఓకె రామోజీకి, చంద్రబాబుకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ఏమైనా పొగుడుకోవచ్చు. తప్పు లేదు. అయితే రామోజీ జయంతిని రాష్ట్ర పండగగా చేయడం ఏమిటన్న చర్చ జరుగుతోంది.
రామోజీని తెలుగు జాతి అంతటికి ప్రతినిధి అన్నట్లు, విలువలతో కూడిన పాత్రికేయం చేసినట్లు ఆ సభలో పాల్గొన్న ఇతర ముఖ్య నేతలు కూడా చెప్పారు. అవన్ని ఎంతవరకు నిజం అన్నదే మీమాంస. ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత సహజంగా ఆయన గురించి మంచే చెబుతారు. కాని అది మోతాదుకు మించినప్పుడు, వివాదాస్పద వ్యక్తి అయినప్పుడు, వ్యవహార శైలిపై భిన్నాభిప్రాయాలు సమాజంలో ఉన్నప్పుడు ఆయన జయంతి రాష్ట్ర పండగ అంటే అది బలవంతంగా ప్రజలపై రుద్దడమే కదా అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చని చంద్రబాబు రుజువు చేసుకుంటున్నారు. ఎవరైనా ఇద్దరి మద్య స్నేహ బంధం బలపడాలంటే, వారిద్దరి భావజాలం కూడా దాదాపు ఒకే విధంగా ఉండాలన్నది ఒక నానుడి.ఆ విషయంలో చంద్రబాబు, రామోజీలకు మధ్య ఆ బంధం బాగానే ఉందనుకోవాలి. గతంలో చంద్రబాబు తాను లీగల్ గా ,టెక్నికల్ గా ఎక్కడా దొరకనని పలు ప్రసంగాలలో చెప్పేవారు.రామోజీరావు కూడా చట్టాన్ని చట్టబద్దంగానే వయలేట్ చేయాలని సన్నిహితులతో వ్యాఖ్యానిస్తుండేవారు. తప్పు చేయకూడదని కాదు..తప్పు చేసినా దొరకరాదన్నది వీరి ధీరీ అన్నమట. టీడీపీని ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు స్థాపించినప్పుడు రామోజీ దినపత్రిక వెంటనే ఏమీ మద్దతు ఇవ్వలేదు.
ఆయనకు వస్తున్న ప్రజాదరణను గమనించిన తర్వాత టీడీపీకి అనుకూలంగా పనిచేయడం ఈనాడు పత్రికకు ప్రయోజనమని భావించారు.ఆ తర్వాత దానికి ఒక సిద్దాంతం తీసుకువచ్చారు. కాంగ్రెస్ ఓటమి, తెలుగుదేశం విజయం చారిత్రక అవసరమన్నది దాని సారాంశం. తన సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు అదే ఉద్భోదించారు. దానితో రాజకీయాలలో ఆయన కీలక భూమిక పోషించడానికి అవకాశం వచ్చింది. టీడీపీని, వామపక్షాలతో కలపడానికి చర్చలు నిర్వహించారు.కాని అది సాధ్యం కాలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఐ పక్షాన మంత్రిగా ఉండేవారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈనాడు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఎన్టీఆర్ కూడా రామోజీకి తగు గౌరవం ఇచ్చేవారు.చంద్రబాబుపై తొలుత రామోజీకి అంత సదభిప్రాయం ఉండేది కాదు.ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో కొన్ని కార్టూన్లు కూడా వేయించేవారు.
1984లో నాదెండ్ల భాస్కరరావు తగు మద్దతు లేకుండా తిరుగుబాటు చేయడం అటు చంద్రబాబుకు, ఇటు రామోజీకి బాగా కలిసి వచ్చింది. దానిని ప్రజలలో తీసుకువెళ్లడానికి రామోజీ విశేష కృషి చేశారు. దాంతో ఈనాడు సర్కులేషన్ కూడా బాగా పెరగడానికి దోహదపడింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తెలివిగా రామోజీతో సంబంధం పెట్టుకుని రెగ్యులర్ గా కలిసేవారు.ఈ లోగా ఒక భవన అంతస్థుల అనుమతి నిరాకరణ,మరికొన్ని అంశాలలో ఎన్టీఆర్కు రామోజీకి మద్య విభేదాలు వచ్చాయని చెప్పుకునేవారు. తన బొమ్మవేసుకుని ఈనాడు సర్కులేషన్ పెంచుకుందని ఎన్టీఆర్అభిప్రాయం అయితే,తన పత్రిక వల్లే ఎన్టీఆర్అధికారంలోకి వచ్చారన్నది రామోజీ భావన. క్రమేపి వీరిద్దరి మద్య అంతరం పెరగడంతో 1989లో రామోజీ టీడీపీకి సీరియస్‌గా మద్దతు ఇవ్వలేదు.అప్పుడు టీడీపీ ఓడిపోవడం కూడా రామోజీకి కలిసివచ్చింది.
తదుపరి కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో అవసరమైనప్పుడు సత్సంబంధాలు నడపడం, తేడా వచ్చినప్పుడు విరుచుకుపడడం వంటి వ్యూహం అవలంభించేవారు.ఆ తరుణంలోనే రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటుకు ఉపక్రమించారు.అప్పట్లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారం కూడా తీసుకునేవారు. సంఘీ పరిశ్రమ చేతిలో ఉన్న ఒక పదేకరాల భూమి తీసుకుంటే కాని ఫిలిం సిటీకి సరైన రోడ్డు సదుపాయం వచ్చే పరిస్థితి లేదు.ఆ టైమ్‌లో సీఎంగా ఉన్న విజయభాస్కరరెడ్డి అందుకు సహకరించి సంఘీ నుంచి భూమి వెనక్కి తీసుకుని రామోజీకి ఇచ్చారు. ఆ రోజుల్లో సారా నిషేధం ఉద్యమం జరుగుతుండేది. ఈనాడు పత్రిక దానిని భుజాన వేసుకుంది.ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనాటి కోట్ల ప్రభుత్వం సారాను నిషేధించింది. అయినా రామోజీ సంతృప్తి చెందలేదు.సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయాలంటూ ఒక పేజీ కేటాయించి వార్తలు రాయించేవారు.
అది కోట్లకు చాలా బాధ కలిగించింది. తనను వాడుకుని రామోజీ ఇలా చేస్తారా అని కోట్ల బాధపడుతుండేవారు. ఆ రోజుల్లో తనకు పోటీగా వస్తున్న ఒక పత్రికను దెబ్బతీసే లక్ష్యంతోనేనని రామోజీ సంపూర్ణ మద్య నిషేధం నినాదం అందుకున్నారని అనుకునేవారు. 1994లో ఎన్టీ రామారావు అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. పూర్తి మెజార్టీ రాదని అని భావించేవారు.కాని ఎన్టీఆర్ ఈనాడు మీడియా సహకారం లేకుండానే అసాధారణ విజయం సాధించారు. తదుపరి ఎన్టీఆర్ మద్య నిషేధం విధించినా ఆయన పట్ల సానుకూల వైఖరి ఉండేది కాదు. అక్కడికి ఎన్టీఆర్,రామోజీల మధ్య రాయబారాలు కూడా జరిగాయి.కాని అవేవి పెద్దగా ఫలించలేదు.అప్పటికే చంద్రబాబుతో రామోజీకి సత్సంబంధాలు ఉండేవి .ఈ క్రమంలో వారి మద్య తరచు భేటీలు జరుగుతుండేవి. ఈ తరుణంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా తిరుగుబాటు చేయడం, అది కూడా విశాఖ లోని డాల్పిన్ హోటల్ నుంచే శ్రీకారం చుట్టడం విశేషం.
ఆ తర్వాత పరిణామాలలో రామోజీ టీడీపీలో చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకున్నారు. ఎన్టీఆర్‌ను పదవినుంచి దించడానికి అవసరమైన సలహా,సంప్రదింపులు జరిపేవారని అంటారు.మొత్తం మీద చంద్రబాబు సీఎం అయ్యారు.ఆ తర్వాత రామోజీకి విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది.వారానికి ఒక రోజు కచ్చితంగా రామోజీ ఇంటికి వెళ్లి చంద్రబాబు మాట్లాడి వచ్చేవారు. రామోజీ చెప్పినవన్ని చేశారా?లేదా?అన్నది ఇక్కడ ప్రధానం కాదు. కేవలం రామోజీ అహం తీర్చాలన్నదే చంద్రబాబు ఉద్దేశం అని కొందరు వ్యాఖ్యానిస్తుండేవారు. అప్పట్లో రామోజీని రాజగురు అని పలువురు సంభోధిస్తుండేవారు. చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాయడం, వ్యతిరేకంగా ఉండే వాటిని నిలిపివేయడం వంటివి చేసేవారు.చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు ఒక ఎడిటోరియల్ రాసి సరిపెట్టుకున్నారు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రతి ఎన్నికల సమయంలో ఇస్తుంటారు. వాటన్నిటిని ఈనాడు మీడియా సమర్ధిస్తూ వచ్చింది.
అవి అమలు చేయకపోయినా ఈ మీడియా ప్రశ్నించదు. చంద్రబాబు రాజకీయానికి ఈయన అండగా నిలిస్తే,రామోజీ వ్యాపారాలకు చంద్రబాబు మద్దతుగా నిలవడం అందరికి తెలిసిందే. 1995 నుంచి ఇప్పటివరకు అవే సంబంధాలు కొనసాగుతున్నాయన్నది చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగా చంద్రబాబు ప్రభుత్వం లో ఏ స్కామ్ జరిగినా ,ఏమీ జరగనట్లు ఈనాడు మీడియా కప్పిపుచ్చుతుంటుంది. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి,వైఎస్ జగన్ లు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఉన్నవి,లేనివి కలిపి, బూతద్దంలో చూపుతూ కధనాలు ఇవ్వడం అలవాటుగా ఈనాడు మీడియా చేసుకుంది. ఏ ప్రభుత్వం ఉన్నా,వాస్తవాలు రాస్తే ఎవరూ కాదనరు.కాని పూర్తిగా టీడీపీ అనుకూల పత్రికగా,కొన్నిసార్లు టీడీపీ కరపత్రానికన్నా ఘోరంగా వార్తలు ఇస్తోంది. ఆ క్రమంలో గత ముఖ్యమంత్రి జగన్ పై ఎన్ని దారుణమైన నీచమైన,అసత్య కధనాలను ఈనాడు ప్రచారం చేసింది ,ఒక్కసారి వెనక్కి తిరగేస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఇవేనా పత్రిక విలువలు అంటే అన్నఅభిప్రాయం కలుగుతుంది. ఆయన మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ ద్వారా చట్ట విరుద్దంగా డిపాజిట్లు వసూలు చేయడం వివాదం అయింది. వైఎస్ఆర్ పాలన టైమ్‌లో ఆ విషయం బయటకు రావడం, అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ దానిపై కేసు వేసి పోరాటం చేయడం ఇటీవలి చరిత్రే.ఆ పోరాటం ఫలితంగానే రామోజీ తాను అక్రమంగా తీసుకున్న 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. ఇందుకోసం తన టీవీ చానళ్లను విక్రయించారని చెబుతారు.అది ఆయనకు కోప కారణం అయింది. రామోజీ మీడియా తనకు ఇష్టం లేనివారిపై విషపూరిత వార్తలు ఇవ్వడం, ఇష్టమైతే ఎన్ని దారుణాలు, ఎన్ని స్కామ్ లు జరిగినా సమర్ధించే దశకు చేరుకున్నారు.
రామోజీ సంస్థలకు సంబంధించి కోర్టు వ్యవహారాలను కూడా చంద్రబాబుకు సన్నిహితులైన న్యాయవాదులే పర్యవేక్షిస్తుంటారన్న భావన కూడా లేకపోలేదు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు, రామోజీల బంధం విడదీయలేని కవలల వంటిదని అంటారు. ఈ నేపధ్యంలో ముట్నూరు కృష్ణారావు వంటి చాలా మంది గొప్ప,గొప్ప జర్నలిస్టులు స్వాతంత్ర ఉద్యమం నుంచి ఉండగా,వారెవ్వరికి ఇలాంటి గౌరవం ఇవ్వకుండా, జర్నలిజాన్ని వ్యాపారంగా మార్చిన రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగ అని చెప్పడం విమర్శలకు దారి తీస్తోంది.
అక్షరాన్ని అస్త్రంగా మలచిన మహానీయుడు అని రామోజీ పై ఆయన కుమారుడు కిరణ్ తన సంపాదకీయంలో పేర్కొన్నారు.కాకపోతే ఆ అస్ర్తం తెలుగుదేశం కోసం అధికంగా పనిచేసింది తప్ప ప్రజల కోసం కాదన్నది ఎక్కువ మంది నమ్మకం.చంద్రబాబుతో పాటు ఆయన ఆధ్వర్యంలోని టీడీపీ సేవలో తరించడం ఈనాడు సంస్థల ధ్యేయం అయితే, రామోజీ జయంతిని రాష్ట్ర పండగ అని ప్రకటించి తన విధేయతను కొనసాగించి ఆ మీడియాను తన చేతిలో ఉంచుకోవడం చంద్రబాబు లక్ష్యం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తెలుగు జాతికి ఎలా కీర్తి, స్పూర్తి అవుతుంది?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


