పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వజం
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తు ముగ్గురు ఎంపీలపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై పెట్రోలు బాంబులతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
''మా పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హత్యాయత్నం చేశారు. తన రౌడీలు, గూండాలతో పెట్రోలు బాంబులతో తెగబడ్డారు. కశ్మీర్ తరహాలో రాళ్లదాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే పక్కా ప్లాన్‌తో దాడులు చేశారు. అవినాష్ రెడ్డి దొరికితే హతమార్చడానికి ప్లాన్ చేశారు. అసలు ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉంటుందా?
వైఎస్సార్ సీపీ వారు నామినేషన్లు వేస్తే ఎన్నికలు జరుగుతాయని టీడీపీ వారు భయపడుతున్నారు. తాము ఓడిపోతామనే భయంతో అసలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారు. ఏకగ్రీవాలు చేయలేకపోయామనే బాధతో నిన్న బీటెక్ రవి ధర్నా చేశాడు. ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డిపై దాడి చేస్తుంటే పోలీసులు తుపాకులు ఎందుకు ఎక్కు పెట్టలేదు? పోలీసుల చేతులు కట్టేసింది ఎవరు? రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఏపీలో అర్జంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలి. కోర్టుల ఆదేశాలను కూడా లెక్క చేయని స్థితిలోకి పోలీసులు వెళ్లిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికలలో గెలవాలని టెలికాన్ఫరెన్స్ నిర్వహించటం సిగ్గుచేటు. చంద్రబాబు మాటలే ఇలాంటి దాడులకు అవకాశం కల్పిస్తున్నాయ''ని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన పులివెందుల డీఎస్పీ


