ప్రధాని వచ్చినప్పుడు నిలబడాలి.. మీడియా అలా ఉండ‌దు! | Senior Journalist Buddha Murali on Scribe Selfies With Policy Makers | Sakshi
Sakshi News home page

చివరకు ఇలా మిగిలాం!

Nov 20 2026 2:15 PM | Updated on Nov 20 2026 2:15 PM

Senior Journalist Buddha Murali on Scribe Selfies With Policy Makers

కార్పొరేట్‌ మీడియా పట్టించుకోలేదుగానీ ప్రధాని న‌రేంద్ర‌ మోదీతో ఢిల్లీ మీడియా సెల్ఫీ దిగడానికి పోటీ పడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఊపేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

చంద్రశేఖర్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఆయన వచ్చేప్పటికి జర్నలిస్టులు అంతా కూర్చొని ఉన్నారు. ప్రధాని వచ్చినప్పుడు నిలబడాలని చంద్రశేఖర్‌ కోరారు. అలా ఉండదని మీడియా సమాధానం. కనీసం తన వయసును చూసైనా లేచి నిలబడి గౌరవం ఇవ్వాలని చంద్రశేఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా నిటారుగా నిలబడి ఉన్న కాలంలో జరిగిన సంఘటన ఇది.

1994లో పీవీ నరసింహారావు ప్రధా నిగా ఉన్నప్పుడు వరంగల్‌ జిల్లాకు వస్తే జిల్లా రిపోర్టర్లం ప్రధానితో నిలబడి ఫొటో తీసుకున్నాం. విలేకరుల సమావేశంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉండేది. ఆర్థిక సంస్కరణలు, బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు ఇస్తామనే హామీ... ఎవరు ఏమి అడిగినా పీవీ సమాధానం చెప్పినట్టు జ్ఞాపకం. మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ‘మౌన మోహన్‌ సింగ్‌’ అని మీడియా వ్యంగ్యోక్తులు విసిరేది. అలాంటి మన్మోహన్‌ కూడా విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు. ప్రశ్నలు ఎదుర్కొనేవారు.

ఒక్క మోదీ మినహా ప్రధాన మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అందరూ విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. బీజేపీ తరపున వాజ్‌పేయి గతంలో రెండు సార్లు ప్రధానిగా చేశారు. అనేకసార్లు విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. గతంలో ప్రధానులు విదేశీ పర్యటనకు మీడియాను వెంట తీసుకువెళ్ళేవారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించేవారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మీడియా ట్రంప్‌ను నిలదీస్తే, మీడియాను ట్రంప్‌ దూషిస్తారు. అయినా మీడియా ముందుకు మాత్రం వస్తారు.

ఇదీ చ‌ద‌వండి: మారనున్న ప్రపంచ రాజకీయాల దిశ?

2026 సంవత్సరపు మీడియా స్వేచ్ఛకు సంబంధించి ర్యాంకులు ప్రకటిస్తే 180 దేశాల జాబితాలో మన ర్యాంక్‌ 157. పాకిస్తాన్‌ (153), బంగ్లాదేశ్‌ (152) కూడా మనకన్నా మెరుగైన ర్యాంక్‌లో ఉన్నాయి. మీడియా గొంతు నొక్కి అంతా బాగుంది అనే భ్రమల్లో ఉంటే నిండా మునిగేంత వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఏదో ఒక రూపంలో ప్రజల గొంతు వినిపిస్తుంది.

– బుద్దా మురళి 
సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement