శాశ్వత హెచ్చరిక ఈ విషాదం | On This Day: Jim Jones Orchestrated Mass Murder of Over 900 Followers in Jonestown | Sakshi
Sakshi News home page

వ్యక్తిపూజ మరణ శాసనమైన వేళ...

Nov 18 2026 6:00 PM | Updated on Nov 18 2026 6:07 PM

On This Day: Jim Jones Orchestrated Mass Murder of Over 900 Followers in Jonestown

1978 నవంబర్‌ 18: జోన్స్‌టౌన్‌లో సామూహిక మరణాల బీభత్సం

టైమ్‌ మిషన్‌

మతం, సామాజిక సమానత్వం, మానవ హక్కుల పేరుతో ఒక నాయకుడు వేలాది మంది ప్రజలను తనవైపు ఆకర్షించాడు. చివరకు వారిని దారుణమైన మరణం వైపు నడిపించాడు. గుడ్డి నమ్మకం, వ్యక్తిపూజ, మానసిక బానిసత్వం ఎంతటి వినాశనానికి దారితీస్తాయో ప్రపంచానికి చాటిచెప్పిన ఘోర విషాదం అది.

ఈ విషాదానికి కారణమైన వ్యక్తి జిమ్‌ జోన్స్‌. 1931లో అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జన్మించాడు. జాతి వివక్షను వ్యతిరేకించడం, అందరికీ సమాన హక్కులు ఉండాలని ప్రచారం చేయడం ద్వారా అనేక మందిని ఆకట్టుకున్నాడు. 1950వ దశకంలో ఇండియానాపోలిస్‌ నగరంలో ‘పీపుల్స్‌ టెంపుల్‌’ అనే మత సంస్థ (కల్ట్‌)ను స్థాపించాడు. సంస్థలో తెల్లజాతీయులు, నల్లజాతీయులు కలిసి పని చేయడం అప్పటి అమెరికా వాతావరణంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఆదర్శాల వెనుక నియంతృత్వం
తనను ఎవరూ ప్రశ్నించకూడదని, తన మాటే అంతిమమని జోన్స్‌ భావించేవాడు. సంస్థలోని సభ్యుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర నియంత్రణ సాధించాడు. కొందరు పూర్వ సభ్యులు పత్రికల ద్వారా సంస్థలో జరుగుతున్న వ్యవహారాలను బయటపెట్టారు. అమెరికా ప్రభుత్వ జోక్యం నుంచి తప్పించుకోవడానికి జోన్స్‌ 1977లో తన అనుచరులతో కలిసి దక్షిణ అమెరికాలోని గయానా దేశానికి వెళ్లాడు. అక్కడ దట్టమైన అడవుల మధ్య భూమి తీసుకుని ‘జోన్స్‌టౌన్‌’ అనే నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. జాతి వివక్ష లేని సమాజం, ఉమ్మడి ఆస్తి, సామూహిక జీవనం వంటి ఆదర్శాలను ప్రచారం చేశాడు.

జోన్స్‌టౌన్‌లో ఉండేవారి ఉత్తర ప్రత్యుత్తరాలు, బయటి ప్రపంచంతో సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు అన్నీ జోన్స్‌ పర్యవేక్షణలోనే ఉండేవి. బయటకు పారిపోవాలని చూసినవారిపై నిఘా ఉంచి భయపెట్టేవారు. అమెరికా ప్రభుత్వం తమపై కుట్ర చేస్తోందని అనుచరుల్లో నిరంతరం భయం నింపేవాడు. ఈ ఆందోళనకర పరిస్థితులపై అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు లియో ర్యాన్‌ స్పందించారు. 1978 నవంబర్‌ 14న జర్నలిస్టులు, బాధితుల బంధువులతో కలిసి గయానా చేరుకున్నారు. నవంబర్‌ 17న జోన్స్‌టౌన్‌ సందర్శించినప్పుడు జోన్స్‌ మొదట ప్రశాంత వాతావరణం ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ కొందరు సభ్యులు తమను అమెరికాకు తీసుకెళ్లాలని ర్యాన్‌ను రహస్యంగా వేడుకున్నారు. నవంబర్‌ 18న ర్యాన్‌ బృందం అక్కడ నివసిస్తున్న కొందరిని తీసుకుని పోర్ట్‌ కైటుమా విమానాశ్రయానికి చేరుకుంది. విమానం బయలుదేరే సమయంలో జోన్స్‌ సాయుధ అనుచరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. లియో ర్యాన్, పలువురు జర్నలిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సామూహిక మారణకాండ
అదే రోజు జోన్స్‌ తన అనుచరులందరినీ సమావేశపరిచాడు. బయటి ప్రపంచం తమను నాశనం చేయడానికి వస్తోందని చెప్పి, సామూహిక మరణాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించాడు. బలవంతంగా విషపూరిత పానీయాన్ని తాగించి వందలాది మంది ప్రాణాలను బలితీసుకున్నాడు. ఆ రోజు 909 మంది మరణించారు. విమానాశ్రయం కాల్పుల్లో ఐదుగురు, జార్జ్‌టౌన్‌ కార్యాలయంలో నలుగురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 918కి చేరింది. అందులో అధిక సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. జిమ్ జోన్స్‌ కూడా మరణించాడు. 

ఇదీ చ‌ద‌వండి: 72 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టిన మహిళ

ఈ ఘోరాన్ని కేవలం సామూహిక ఆత్మహత్యగా చెప్పలేము. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరణించలేదు. భయం, బెదిరింపులు, మానసిక ఒత్తిడి వల్ల బలవంతంగా మృత్యువును కౌగలించుకున్నవారే ఎక్కువ. చిన్నపిల్లలకు నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. అందుకే పరిశోధకులు దీనిని సామూహిక హత్యలు, బలవంతపు మరణాల మిశ్రమ విషాదంగా విశ్లేషిస్తారు. ఒక సమూహంలో వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోతే నాయకుడి అబద్ధాలు కూడా వారికి సత్యాలుగా కనిపిస్తాయి. నమ్మకం మనుషులకు స్వేచ్ఛను, ధైర్యాన్ని ఇవ్వాలిగానీ బానిసత్వాన్ని కాదు. నాయకుడిని ప్రశ్నించే హక్కు, స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఎంత విలువైనవో చెప్పే శాశ్వత హెచ్చరిక ఈ విషాదం.

ఎడిటోరియల్ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement