72 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టిన మహిళ | Nellie Bly: Traveled Around the World in Just 72 Days | Sakshi
Sakshi News home page

72 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టిన మహిళ

Nov 11 2026 12:40 AM | Updated on Nov 11 2026 12:40 AM

Nellie Bly: Traveled Around the World in Just 72 Days

1889 నవంబర్‌ రెండో వారంలో నెల్లీ బ్లై అనే 25 ఏళ్ల అమెరికన్‌ మహిళా జర్నలిస్టు మహిళలు ఇంటికే పరిమితం కావా లనే అభిప్రాయాలను పక్కనపెట్టి, ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలని బయలుదేరింది. ఫ్రెంచ్‌ రచయిత జూల్స్‌ వెర్న్‌ రాసిన ‘ఎరౌండ్‌ ద వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ నవలలోని ‘ఫిలియస్‌ ఫాగ్‌’ పాత్ర ఎనభై రోజుల్లో ప్రపంచ యాత్ర చేసిందని చదివి, తానూ అంతే సమయంలో ప్రపంచాన్ని చుట్టి రావాలనేది ఆమె లక్ష్యం.

ఆమె అసలు పేరు ఎలిజబెత్‌ జేన్‌ కోక్రేన్‌. 1864 మే 5న అమె రికాలోని పెన్సిల్వేనియాలో జన్మించింది. ఒకసారి పత్రికలో మహిళల పాత్రను తక్కువ చేస్తూ ప్రచురితమైన ‘వాట్‌ గరల్స్‌ ఆర్‌ గుడ్‌ ఫర్‌’’ వ్యాసానికి ఎలిజబెత్‌ నిరసన వ్యక్తం చేస్తూ సంపాద కుడికి ఒక ఘాటైన లేఖ రాసింది. ఆ లేఖలోని ఆలోచనా స్పష్టత, ప్రశ్నించే తత్వం, రచనా శైలి సంపాదకుడిని ఆకట్టుకున్నాయి. దాంతో ఆమెకు ఆ పత్రికలోనే ఉద్యోగం లభించింది. సంగీత కారుడు స్టీఫెన్‌ ఫోస్టర్‌ రాసిన ఒక ప్రసిద్ధ పాట నుంచి ప్రేరణ పొంది ఆమె తన కలం పేరుగా ‘నెల్లీ బై్ల’ అని స్వీకరించింది.

స్వయంగా పరిస్థితుల మధ్యలోకి వెళ్లి వాస్తవాలను వెలికి తీయడం ఆమె ప్రత్యేకత. 1887లో న్యూయార్క్‌లోని బ్లాక్వెల్స్‌ ఐలాండ్‌లో ఉన్న మానసిక చికిత్సా కేంద్రంలో ఒక రోగిగా నటించి, 10 రోజుల పాటు అక్కడి అమానుష పరిస్థితులను సంచలనాత్మక కథనాలుగా రాసింది. ‘టెన్‌ డేస్‌ ఇన్‌ ఎ మ్యాడ్‌ హౌస్‌’ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ తర్వాత జోసెఫ్‌ పులిట్జర్‌ నిర్వహణలోని ‘న్యూయార్క్‌ వరల్డ్‌’ పత్రికలో చేరి తన పరిశోధనా త్మక జర్నలిజాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

1889 నవంబర్‌ 14న న్యూజెర్సీ నుంచి బయల్దేరిన ఆగస్టా విక్టోరియా

80 రోజుల్లో ప్రపంచ యాత్ర చేయాలనే తన ఆలోచనను పత్రిక సంపాదకుని ముందు ఉంచింది. కష్టం మీద అందుకు ఒప్పించింది. 1889 నవంబర్‌ 14న న్యూజెర్సీలోని హోబోకెన్‌ నౌకాశ్రయం నుంచి ఆగస్టా విక్టోరియా అనే జర్మన్‌ నౌకలో కేవలం ఒక చేతి సంచితో నెల్లీ బై్ల బయలుదేరింది. ఆమె ప్రయాణానికి తూర్పు దిశను ఎంచుకుంది. అంటే యూరప్‌ మీదుగా ఆసియాకు, అక్కడి నుంచి పసిఫిక్‌ మహాసముద్రం దాటి అమె రికాకు తిరిగి రావాలన్నది ప్రణాళిక. ఆమె వెంట తీసుకెళ్లిన డబ్బు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది. కొంత బ్రిటిష్‌బంగారు కరెన్సీ, కొంత అమెరికన్‌ డబ్బు తీసుకెళ్లింది. 

నౌక అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటి ఇంగ్లండ్‌ చేరు కుంది. అక్కడి నుంచి రైలు ప్రయాణం ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ నుంచి ఫ్రాన్స్ వెళ్లింది. ఫ్రాన్స్‌లో జూల్స్‌ వెర్న్‌ను కలిసింది. నవల ద్వారా తనకు స్ఫూర్తినిచ్చిన రచయితను కలవడం ఆమెకు ప్రత్యేకమైన అనుభవం. ఫ్రాన్స్ నుంచి ఇటలీకి చేరుకుని, బ్రిండిసీ నౌకాశ్రయం నుంచి నౌకలో బయలుదేరి సూయజ్‌ కాలువ ద్వారా ఈజిప్టు, ఎర్ర సముద్రం ప్రాంతాలను దాటింది. ఆ తర్వాత ఏడెన్, సిలోన్‌ (ప్రస్తుత శ్రీలంక), మలయా ద్వీపకల్పం, సింగ పూర్, హాంకాంగ్, జపాన్‌ మీదుగా ప్రయాణించింది.

నౌకలు, రైళ్లు, గుర్రపు బండ్లు, స్థానిక రవాణా వాహనాలు... అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించుకుంది. నిర్ణీత నౌకను అందుకోవడం, రైలు బయలుదేరే సమయానికి చేరు కోవడం, అవసరమైన చోట టెలిగ్రాఫ్‌ ద్వారా పత్రికకు సమా చారం పంపడం ఆమెకు సవాళ్లుగా మారాయి. ఈ ప్రయాణ విశేషాలను న్యూయార్క్‌ వరల్డ్‌ పత్రిక పాఠకులకు అందించేది. 

మరో మహిళ నుంచి పోటీ!
నెల్లీ బై్ల ప్రయాణం ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు. ‘కాస్మోపాలిటన్‌’ పత్రికకు చెందిన ఎలిజబెత్‌ బిస్లాండ్‌ అనే మరో అమెరికన్‌ జర్నలిస్టు కూడా ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరింది. నెల్లీ కంటే ముందుగా ప్రపంచయాత్ర పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆమె పోటీకి దిగింది. ఇద్దరూ వేర్వేరు దిశల్లో ప్రయాణించారు. నెల్లీ తూర్పు దిశగా వెళితే, బిస్లాండ్‌ పశ్చిమ దిశగా బయలుదేరింది. ఈ పోటీ అమె రికాలో పాఠకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

ఆసియా దేశాల మీదుగా ప్రయాణించిన నెల్లీ జపాన్‌ చేరు కుంది. అక్కడి నుంచి పసిఫిక్‌ మహాసముద్రాన్ని దాటి, 72 రోజుల 6 గంటలకు 1890 జనవరి 25న న్యూజెర్సీ చేరుకుంది. అక్కడ ఆమెకు జనం ఘన స్వాగతం పలికారు.

ఎడిటోరియల్ టీమ్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement