13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి! | 13 November 2026 world will end prediction, what 1960 scientific study says? | Sakshi
Sakshi News home page

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Nov 9 2026 12:50 PM | Updated on Nov 9 2026 12:57 PM

13 November 2026 world will end prediction, what 1960 scientific study says?

న్యూఢిల్లీ: 2026 నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 66 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఈ తేదీని అంచనా వేశారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, దీని వెనుక అసలు విషయం వేరే ఉంది. 1960లో అమెరికాకు చెందిన సైన్స్ జర్నల్‌లో ముగ్గురు పరిశోధకులు ప్రచురించిన అధ్యయనం ప్రపంచ వినాశనం గురించి కాదు. వేగంగా పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సంబంధించిన గణితపరమైన అంచనా మాత్రమే.

1960లో ఏం జరిగింది?
1960 నవంబర్ 4న ‘సైన్స్’ అనే అమెరికన్ సైన్స్ జర్నల్‌లో ‘డూమ్స్‌డే: ఫ్రైడే, 13 నవంబర్, ఏడి 2026’ పేరుతో ఓ పరిశోధన ప్రచురితమైంది. ఆస్ట్రియన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త హైన్జ్ వాన్ ఫోర్స్టర్, ప్యాట్రిషియా మోరా, లారెన్స్ అమియట్ ఈ అధ్యయనాన్ని రూపొందించారు. క్రీస్తుశకం ప్రారంభం నుంచి 1958 వరకు ప్రపంచ జనాభాకు సంబంధించిన 24 చారిత్రక అంచనాలను పరిశీలించారు.

జనాభా అనంతంగా పెరుగుతుందని అంచనా!
ప్రపంచ జనాభా పెరుగుదలపై పరిశోధకులు ఓ గణిత నమూనాను రూపొందించారు. జనాభా పెరుగుదల వేగం కాలక్రమేణా మరింత పెరుగుతుందని భావించారు. దీనిని హైపర్బోలిక్ గ్రోత్ అంటారు. ఇదే విధానం కొనసాగితే 2026 నవంబర్ 13 నాటికి ప్రపంచ జనాభా గణితపరంగా అనంతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే ఇది వాస్తవంగా సాధ్యమయ్యే పరిస్థితి కాదు.

ప్రపంచం అంతం కావడం నిజమేనా?
ఈ పరిశోధనలో ఉపయోగించిన డూమ్స్‌డే అనే పదం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. కానీ శాస్త్రవేత్తలు గ్రహశకలం భూమిని ఢీకొంటుందని, భూకంపాలు వస్తాయని లేదా సూర్యుడు పేలిపోతాడని చెప్పలేదు. గణిత సమీకరణంలో జనాభా అనంతంగా మారే పరిస్థితిని మాత్రమే వివరించారు. భూమిపై వనరులు పరిమితంగా ఉన్నందున జనాభా నిజంగా అనంతంగా పెరగడం సాధ్యం కాదు.

పౌర తుపాన్లతో ముడిపెడుతూ ప్రచారం
1964 నవంబర్ 29న ఈజిప్టు వార్తాపత్రికలో మిషెల్ టెక్లా రాసిన పాత కథనం కూడా ప్రస్తుతం చర్చకు వస్తోంది. ఆ కథనాన్ని 1960 నాటి పరిశోధనతో ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సౌర జ్వాలలు, కరోనా మాస్ ఇంజెక్షన్ల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. వీటి వల్ల ఉపగ్రహాలు, సమాచార వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ భూమి నాశనమవుతుందని అర్థం కాదు. నవంబర్ 13న భూమికి ప్రమాదం కలిగించే ఖగోళ ఘటన ఏదీ లేదని ఖగోళ శాస్త్రవేత్త ఇమాద్ ముజాహిద్ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి అంచనా ఏంటి?
ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ జనాభా సుమారు 820 కోట్లు. 2080ల మధ్య నాటికి ఇది 1,030 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2100 నాటికి ప్రపంచ జనాభా సుమారు 1,020 కోట్లకు చేరవచ్చని తెలిపింది. మొత్తంగా నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందనే ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 1960 నాటి అధ్యయనం జనాభా పెరుగుదలపై చేసిన గణితపరమైన అంచనా మాత్రమే. 

ఇదీ చదవండి: ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement