ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం నడుస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హువాంగ్‌ను మంచి మనసున్న వ్యక్తిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. అమెరికా కోసం ఆయన అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. అయితే.. చైనా వ్యాపారవేత్తతో సంబంధాలున్నాయన్న ఆరోపణల గురించి తాను హువాంగ్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. హువాంగ్ చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని తనకు తెలుసని అన్నారు. కానీ.. ఆయన వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అంతా సవ్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆరోపణలపై హువాంగ్ వివరణ కూడా వినాలని, ఆయనకు తన వాదన చెప్పుకోవడానికి ఏదైనా కారణం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమె బీజింగ్‌కు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హువాంగ్ విదేశీ గూఢచర్య ప్రయత్నాలకు లక్ష్యంగా మారారా?.. అనే కోణంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించింది. ఈ పరిణామం టెక్ ప్రపంచంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వచ్చే వారం ట్రంప్ ఆసియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు జెన్సన్ హువాంగ్‌ను కూడా తీసుకెళ్తారా అని మీడియా ప్రశ్నించగా.. తనకు ఇంకా తెలియదని, అయితే హువాంగ్‌ను తీసుకెళ్లడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానని ట్రంప్ బదులిచ్చారు. దీంతో వివాదం కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ ఆయనకు మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హువాంగ్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఏంటనేది ఎన్విడియా చేపట్టిన విచారణలో తేలాల్సి ఉంది.


