వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు ఒకవైపు యుద్ధ సెగ.. మరోవైపు ఎన్నికల దెబ్బ తగిలింది. ఇరాన్‌తో ఎనిమిది నెలలుగా సాగుతున్న ఘర్షణకు ముగింపు పలకలేక సతమతమవుతున్న ట్రంప్ ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికల ఫలితాలు మరో రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయా? రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న పరాజయాన్ని ఇప్పుడు ఇరాన్ తనకు అనుకూలమైన రాజకీయ అస్త్రంగా మార్చుకుంటోంది.
అమెరికా యుద్ధంలోనూ ఓడింది.. ఎన్నికల్లోనూ దెబ్బతింది అంటూ ఇరాన్ నేతలు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై అమెరికాకు ఎలాంటి సులభమైన దారి ఇవ్వబోమని, యుద్ధానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని ఇరాన్ ప్రతినిధులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు మరో మలుపు తిరుగుతున్నాయి.
వాషింగ్టన్‌కు సూటి ప్రశ్న!
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా రెజాయ్..‘యుద్ధంలో ఓడిపోయారు.. ఎన్నికల్లోనూ ఓడిపోయారు. వాన్స్ ఓటమిని అంగీకరించారు, రూబియో నిష్క్రమణ దిశగా ఉన్నారు, హెగ్‌సెత్ తొలగింపును ఎదుర్కొంటున్నారు. సెంట్కామ్ కమాండర్ ఇప్పుడు పాడ్‌కాస్టర్‌గా మారారు. మరి మా సందేశాన్ని వాషింగ్టన్‌లో ఎవరికి చేరవేయాలి?’ అంటూ ప్రశ్నించారు. అమెరికా నాయకత్వం బలహీనపడుతోందని, యుద్ధం ట్రంప్‌కు స్వదేశంలోనూ రాజకీయ సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు.
ట్రంప్‌ను అంత తేలిగ్గా వదలొద్దు!
అమెరికా ఎన్నికల ఫలితాలతో ఇరాన్‌లోని కొందరు నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. యుద్ధంలో అమెరికా ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోయిందని వారు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చల పేరుతో అమెరికాకు ఎలాంటి వెసులుబాటు కల్పించకూడదని, ఇరాన్ తన డిమాండ్లపై వెనక్కి తగ్గకూడదని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా లొంగుబాటు ధోరణికి ఏమాత్రం తావివ్వకూడదని హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న ప్రతినిధులకు ఈ వ్యాఖ్యలు సంకేతాలుగా భావిస్తున్నారు. ఇరాన్‌కు చెందిన రాజా న్యూస్ సైతం అమెరికా ఈ యుద్ధం నుంచి సులభంగా బయటపడేందుకు అనుమతించకూడదని పేర్కొంది. ఇరాన్‌పై దాడులకు అమెరికా మూల్యం చెల్లించాలని, హడావుడిగా ఒప్పందం చేసుకుని ట్రంప్ బయటపడే పరిస్థితి కల్పించకూడదని తన కథనంలో స్పష్టం చేసింది.
వాన్స్ వ్యాఖ్యలతో ఇరాన్‌కు కొత్త అస్త్రం..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయానికి ఇరాన్ యుద్ధం కూడా ఒక కారణమని ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించినట్లు కథనం వెల్లడించింది. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్ యుద్ధ ప్రభావం ఎన్నికల ఫలితాలపై కొంతమేర ఉందని అంగీకరించగా, వాన్స్ మాత్రం మరింత స్పష్టంగా స్పందించారు. మనం ఓడిపోవడానికి కారణం యుద్ధమే అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే ఇప్పుడు ఇరాన్ నేతలు అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారు. యుద్ధం అమెరికాకు సైనికపరంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా కూడా భారంగా మారిందని వాదిస్తున్నారు.
మొత్తానికి.. అమెరికా ఎన్నికల ఫలితాలు ఇరాన్‌కు కొత్త రాజకీయ అస్త్రంగా మారగా, ట్రంప్ ప్రభుత్వానికి యుద్ధం, దౌత్యం, స్వదేశీ రాజకీయాలు మూడు సవాళ్లుగా మారాయి. ఇరాన్ డిమాండ్లకు అమెరికా తలొగ్గుతుందా? లేక మరోసారి సైనిక చర్యలకు దిగుతుందా? హార్ముజ్ జలసంధి వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా వాషింగ్టన్, టెహ్రాన్ తదుపరి నిర్ణయాలపైనే ఉంది.
ఇదీ చదవండి: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు


