తీవ్ర సంక్షోభంలో పరాగ్వే | Paraguay facing a banking and political crisis | Sakshi
Sakshi News home page

తీవ్ర సంక్షోభంలో పరాగ్వే

Nov 8 2026 5:12 AM | Updated on Nov 8 2026 5:12 AM

Paraguay facing a banking and political crisis

కుప్పకూలిన డిజిటల్‌ బ్యాంకు యుయెనో

జనాభాలో సగానికి సేవలందిస్తున్న బ్యాంక్‌

స్తంభించిన 30 లక్షల పొదుపు ఖతాలు, ప్రభుత్వ నిధులు

దేశాధ్యక్షుడు శాంటియాగో పెనా తొలగింపు

ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచిన పార్లమెంట్‌

అసున్సియోన్‌: దక్షిణ అమెరికా దేశం పరాగ్వే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. దేశ జనాభాలో దాదాపు సగం మందికి సేవలందించే యుయెనో బ్యాంకు కుప్పకూలింది. ప్రజలు దాచుకున్న సొమ్ముతోపాటు ప్రభుత్వ నిధులు కూడా స్తంభించిపోవడంతో, ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక వేత్త కూడా అయిన దేశాధ్యక్షుడు శాంటియాగో పెనా పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సన్నిహితుడు కూడా అయిన అధ్యక్షుడు పెనాను పార్లమెంట్‌ అభిశంసించి, గృహ నిర్బంధంలో ఉంచింది.

అనతికాలంలోనే ఎదిగిన బ్యాంకు
పరాగ్వేలో నెలకొన్న సంక్షోభానికి గ్రుపో వజ్‌క్వెజ్‌ వ్యాపార సామ్రాజ్యం సారథ్యంలో నడిచే యుయెనో బ్యాంకు ప్రధాన సూత్రధారి. 2022లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ డిజిటల్‌ బ్యాంకు అనతికాలంలోనే దేశంలోనే కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీని వెనుక అధ్యక్షుడు పెనా హస్తముందని ఆరోపణలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, జల విద్యుత్‌ దేశ ప్రధాన ఆదాయ వనరులు. దేశ జనాభా 64 లక్షలు కాగా, ఇందులో సగం మంది, 30 లక్షల మందికి ఈ బ్యాంకులో ఖాతాలున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, పింఛను విభాగాలకు సంబంధించిన 850 మిలియన్‌ డాలర్ల నిధులు ఈ బ్యాంకులో ఉన్నాయి. అనుబంధ కంపెనీల ద్వారా బ్యాంకుపై గ్రుపో వజ్‌క్వెజ్‌ ఆధిపత్యమే నడుస్తోంది.

బ్యాంకు పతనానికి కారణమిదే.
యుయెనో బ్యాంక్‌ కుప్పకూలడానికి ప్రధాన కారణం.. బ్యాంక్‌ యజమానులకు చెందిన కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా, తగు హామీలు లేకుండా యథేచ్ఛగా పెద్ద మొత్తాల్లో రుణాలు మంజూరు చేయడం. చట్టపరమైన పరిమితులను మించి ఈ లావాదేవీలు జరిగాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ జూన్‌లోనే విషయాన్ని గుర్తించింది. ఖాతాలను సరి చేసి చూడగా, మూలధనం విలువ సగానికి మించి పడిపోయింది. నవంబర్‌ 3న డిపాజిట్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేసే ప్రక్రియను సెంట్రల్‌ బ్యాంకు ప్రారంభించింది. ఈ సంక్షోభం కారణంగా కస్టమర్లు తమ పొదుపు ఖాతాల డబ్బును విత్‌డ్రా చేసుకోలేకపోయారు. 

ప్రభుత్వ పింఛను నిధులు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల 32వేల మందికి పింఛను అందలేదు. ఈ సమయంలో నవంబర్‌ 5న ప్రభుత్వం చిన్న మొత్తాలతో కూడిన అకౌంట్ల నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. యూయెనోలో చిక్కుకుపోయిన తమ డబ్బును వెంటనే అందుకున్న సదుపాయం కల్పించాలంటూ బాధితులు రాజధాని అసునియోన్‌లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తమకు రావాల్సిన వేతనాలను అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ యూయెన్‌ బ్యాంకు సిబ్బంది సైతం డిమాండ్‌ చేశారు.

అధ్యక్షుడిగా మరొకరు..
గ్రుపో వజ్‌క్వెజ్‌తో అధ్యక్షుడు పెనాకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్థిక వేత్త, మాజీ ఆర్థిక మంత్రి, ఐఎంఎఫ్‌లో పనిచేసిన అనుభవం కలిగిన పెనా 2023లో దేశాధ్యక్షుడయ్యారు. గ్రుపో వజ్‌క్వెజ్‌లో గతంలో ఈయనకు వాటాలున్నాయి. అయితే, 2025లోనే వాటాను విక్రయించేశానని, ఆ కంపెనీతో ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధాలు లేవని ఆయన వాదిస్తున్నారు. పెనా సూచనల మేరకు సెంట్రల్‌ బ్యాంకు అధ్యక్షుడు కూడా రాజీనామా చేశారు. బ్యాంకు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సహా మొత్తం 27 మందిపై పార్లమెంట్‌ అభియోగాలు మోపింది. కొందరిని ఇప్పటికే జైలుకు పంపించి, వారిపై విచారణ చేపట్టింది. 

పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడు పెనా నవంబర్‌ 5వ తేదీన ప్రకటించారు. అయితే, 6న పార్లమెంట్‌ అత్యవసర సమావేశం చేపట్టింది. ఈ భేటీని అధ్యక్షుడు పెనా సారథ్యంలోని కొలరాడో పార్టీ వాకౌట్‌ చేసింది. యుయెనో బ్యాంకు సంక్షోభానికి అధ్యక్షుడు పెనా కారణమని ఆరోపిస్తూ 7వ తేదీన దిగువ సభ 97–0 ఓట్లతో అభిశంసన తీర్మానం చేసింది. విచారణకు తమ ఎదుట హాజరుకావాలంటూ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేసింది. అభిశంసన కారణంగా స్వతహాగా అధ్యక్షుడికి ఉండే రక్షణలు లేకుండాపోతాయి. దీంతోపాటు, దేశ ఉపాధ్యక్షుడు పెడ్రో అల్లియానాను మిగతా పదవీ కాలానికి గాను, 2028 ఆగస్ట్‌ వరకు అధ్యక్షుడిగా పార్లమెంట్‌ నియమించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement