ఆస్పత్రుల నుంచి తల్లీబిడ్డలను ఇళ్లకు తరలించే సేవలనూ వదలని చంద్రబాబు సర్కార్
ప్రాజెక్ట్ ధర అమాంతం పెంచేసి ప్రజాధనం లూటీ
గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు రూ.895 ఖరారు
ఒకే రకం సేవకు ఇప్పుడు రూ.1,640 చెల్లించనున్న బాబు సర్కార్
83 శాతం అధిక ధరతో ఏటా రూ.15 కోట్ల పైనే ప్రజాధనం లూటీ
ప్రతి ట్రిప్పునకు కమీషన్ పొందే డీల్‌తో అస్మదీయ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టిన కీలక ప్రజాప్రతినిధి
నేడు రాష్ట్రవ్యాప్తంగా సేవలు ప్రారంభించనున్న కొత్త కాంట్రాక్ట్ సంస్థ
నాడు
కాంట్రాక్ట్ సంస్థ 500 మారుతి ఈకో వాహనాలను సమకూర్చింది. ప్రతి వాహనంలో ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు రూ.895 చొప్పున వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది.
నేడు
ఇప్పుడు కూడా మారుతి ఈకో వాహనాలే. ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్ సహా నాటికీ, నేటికీ వాహనంలోని సౌకర్యాల్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు ఏకంగా రూ.1,640 చొప్పున చంద్రబాబు సర్కార్ ఇవ్వబోతోంది.
సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల స్వరూపం ఏ మాత్రం మారకపోయినా ప్రాజెక్ట్ వ్యయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దల కమీషన్ దాహమేనని తేటతెల్లం అవుతోంది. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి, జనం సొమ్ము కాంట్రాక్టర్‌లకు మళ్లించి, వారి నుంచి సొమ్ము చేసుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సైతం వదలడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్‌లు పిలిచి, ఒక్కో ట్రిప్పుకు రూ.895 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఆ కాంట్రాక్ట్ సంస్థే 2022 నుంచి సోమవారం వరకు సేవలు అందించింది. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్‌పై కీలక ప్రజాప్రతినిధి కన్నేశారు. ట్రిప్పు ట్రిప్పునకు పెద్ద మొత్తంలో కమీషన్ పొందేలా ఆ ప్రజాప్రతినిధి డీల్ కుదర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థకు అనుకూలమైన నిబంధనలతో గతేడాదే వైద్య శాఖ టెండర్లు పిలిచింది.
ఈ క్రమంలో ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థ ఏకంగా ఒక్కో ట్రిప్పునకు రూ.2,300 చొప్పున ధర కోట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధుల లూటీకి స్కెచ్ వేశారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో ఈ దోపిడీకి సహకరించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేయించి, మరోమారు పిలిచారు.
రెండోసారి టెండర్‌లో కుదిరిన రేటు
రెండోసారి పిలిచిన టెండర్‌లో అదే సంస్థ ట్రిప్పునకు రూ.1,640 చొప్పున కోట్ చేయగా, ప్రభుత్వం కళ్లు మూసుకుని కాంట్రాక్ట్ కట్టబెట్టేసింది. ఒకే తరహా సేవకు నాలుగేళ్ల వ్యవధిలో 83 శాతం రూ.745 (దాదాపు రెట్టింపు) చొప్పున ట్రిప్పునకు అదనంగా చెల్లించడానికి సిద్ధమైంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నెలకు 15 వేల ట్రిప్‌లు వేస్తున్నాయి.
ట్రిప్పునకు రూ.895 చొప్పున నెలకు రూ.1.34 కోట్లు.. ఏడాదికి రూ.15 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. చంద్రబాబు సర్కార్ కొత్తగా ఖరారు చేసిన రూ.1,640 ధరతో నెలకు రూ.2.46 కోట్లు.. ఏడాదికి రూ.30 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటోంది. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయంతో పోలిస్తే ఏడాదికి రూ.15 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఈ లెక్కన పెరిగిన రేట్ల ప్రకారం చూస్తే మూడేళ్లలో రూ.45 కోట్లు ఖజానాకు గండి పడనుంది.
తొలుత 300 వాహనాలతోనే సేవలు
టెండర్ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థ ఒకేసారి 500 వాహనాలతో సేవలు ప్రారంభించాల్సి ఉంది. అయితే 500 వాహనాలను ఒకేసారి అందుబాటులోకి తేవడంలో కొత్త కాంట్రాక్టర్ విఫలమైనట్టు వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేవలం 300 వాహనాలను మాత్రమే సమకూర్చడంతో వాటితోనే నేడు అంటే మంగళవారం ప్రభుత్వం సేవలు ప్రారంభిస్తోంది. మిగిలిన 200 వాహనాలు రెండో దశలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కమీషన్ల కోసం సామర్థ్యం, ఆర్థిక స్థోమత లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు 500 వాహనాలతో అందుతున్న సేవలు ఒక్కసారిగా 300కు పరిమితం చేసి, ప్రభుత్వాస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసింది.


