కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా? | YSRCP President YS Jagan Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా?

Aug 11 2026 5:35 AM | Updated on Aug 11 2026 5:35 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt

డీఎస్సీ అక్రమాలపై విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

డీఎస్సీ పేపర్‌ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి 

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.9 వేల కోట్లు చెల్లించాలి.. ఇంటింటికి బాండ్లు పంచి చెప్పిన నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున బకాయిలు సహా ఇవ్వాలి 

ప్రజలు, యువత డిమాండ్లు ఇంత స్పష్టంగా ఉంటే డైవర్షన్‌ చేయడం ఎంత వరకు సమంజసం? 

ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి 

మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువత, ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు.. 

డీఎస్సీ అక్రమాలపై రెండు నెలలుగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటం చిరస్మరణీయం 

సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.9 వేల కోట్ల బకాయి.. వసతి దీవెన బకాయి వెంటనే చెల్లించాలి. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలి. ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్‌ చేస్తుంటే, వాటిని డైవర్ట్‌ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్‌లను అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు.  

10 కార్యక్రమాలకు విశేష మద్దతు
‘చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు పూనుకున్నారు. పోలీసు బలంతో అణచి వేయాలని చూశారు. నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన 74 రోజుల్లో రాష్ట్ర గవర్నర్‌ను కలవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజా­నీ­కం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యా­యి’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

మే 29 –  రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు
⇒ జూన్‌ 1 – జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతి పత్రాలు
⇒ జూన్‌ 8, 9 – నియోజకవర్గ స్థాయి టౌన్‌ హాల్‌ సమావేశాలు
⇒ జూన్‌ 12 – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
⇒ జూన్‌ 18 – రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం
⇒ జులై 28 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు
⇒ జులై 31 – జిల్లా కలెక్టర్లు జేసీలకు వినతులు
⇒ ఆగస్టు 3, 4 – రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్, టౌన్‌హాల్‌ సమావేశాలు
⇒ ఆగస్టు 6, 8 – నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు
⇒ ఆగస్టు 10 – రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

ఇంత మంది అడుగుతున్నా నోరు విప్పరా?
ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపడం లేదని, లోకేశ్‌ సమాధానం చెప్పడం లేదని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎస్సీ పేపర్‌ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యా దీవెన), వసతి దీవెన కింద దాదాపుగా రూ.9 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ పేరిట హామీలు, నెలా నెలా రూ.3 వేల చొప్పున  నిరుద్యోగ భృతి.. ఇవేవీ లేవు. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.08 లక్షలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డారు. ఈ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు తెరవలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 

విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యం. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుంది. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు.. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు.. వీళ్లంతా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత నిలదీస్తోంది. చంద్రబాబు స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగులు, విడిచి పెట్టరు. జెన్‌–జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాలి. అంత వరకు పోరాటాలు ఆగవు’ అని వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement