కాకినాడ జిల్లా తునిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు
సర్కారు కుట్రలు, పోలీసుల అడ్డంకులను అధిగమించి ప్రజా పోరు
డీఎస్సీ స్కామ్‌పై లోకేశ్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్
సీబీఐ విచారణ జరిపించాలని యువత నినాదాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని నిలదీత
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ ర్యాలీలు విజయవంతం
ఎప్పటిలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయాలని చంద్రబాబు కుట్ర
వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, ముందస్తు నోటీసులు
ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ ఆంక్షలతో ఉక్కుపాదం
ఎన్ని రకాలుగా పోలీసులను ప్రయోగించినా ఉప్పెనలా తరలివచ్చిన జనం
ఎక్కడికక్కడ ర్యాలీలు సక్సెస్ కావడంతో సర్కారులో వణుకు
డిమాండ్లు నెరవేరే వరకు పోరు కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: దగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుపై యువత భగ్గుమంది. దగా డీఎస్సీకి కారకుడైన మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా పోరు విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం భారీ ర్యాలీల ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, యువత కదం తొక్కారు. టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పి ఎన్ని అడ్డంకులు కల్పించినా, మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలను విజయవంతం చేసిన జెన్ జీ యువత ర్యాలీలకు సైతం భారీగా తరలి వచ్చింది. మెగా డీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. జెన్ జీ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు పలకడంతో తన కుమారుడి భవితవ్యం ఇబ్బందుల్లో పడుతుందని కలవరపడుతున్న చంద్రబాబు మూడు రోజులపాటు నిర్వహించిన రిలే దీక్షలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులను, పోలీసులను పురిగొల్పిన సంగతి తెల్సిందే. సోమవారం నిర్వహించిన ర్యాలీలను సైతం అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు, అరెస్టులతో రెచ్చిపోయారు. అయినా ప్రజలు, యువత నిరసన ర్యాలీలకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. 
లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కదంతొక్కిన నిరుద్యోగులు, యువత
అడుగడుగునా చంద్రబాబు సర్కారు జులుం
డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ, యువత ఆందోళనలతో బెంబేలెత్తిపోతున్న సీఎం చంద్రబాబు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సోమవారం కూడా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలపై జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై డీఎస్పీ మురళీనాయక్ నాయకత్వంలో పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు. కడపలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ను పోలీసులు అడ్డుకోగా, ఆయన ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. భరత్ ఇంటిపై దాడికి టీడీపీ నేతలు దూసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీకి పోటీగా కావాలనే టీడీపీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో హైటెన్షన్ నెలకొంది.
ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయింపు
చిత్తూరులో ర్యాలీకి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చి పడేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స తదితర నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురం జిల్లాలో ముచ్చుకోట వద్ద తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు ఒత్తిడి చేశారు.
ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులు
విజయవాడ సెంట్రల్ వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పోలీసుల బారికేడ్లు దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జగదాంబ జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకున్నారు. విశాఖ నార్త్‌లో ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుని బైక్‌ల తాళాలు తీసుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్ చేస్తామని భయపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీలు ఇచ్చిన పోలీసులు పలుచోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రికత్త నెలకొంది. చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన టెంట్‌ను పోలీసులు దౌర్జన్యంగా పీకేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవనిగడ్డలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
నెల్లూరు సిటీ నియోజకవర్గం ట్రంక్ రోడ్డులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న శ్రేణులు
బెదిరింపులను ఖాతరు చేయని ప్రజలు
కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్వీ విజయ మనోహరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భరత్ ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన చేపట్టారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో ఆయన ఇంటి వద్దే ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో కురసాల కన్నబాబును అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఏడు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు.
సాగు అవసరాల కోసం వెళితే పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు
‘మేమంతా సాగు అవసరాల కోసం టెక్కలి వచ్చాం. అయితే మీరంతా ధర్నాకు వెళ్తున్నారని పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు’ అని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం అన్నాపురం రైతులు వాపోయారు. వీరు యూరియా, ఇతర సాగు అవసరాల కోసం ఆటోలో టెక్కలి వస్తుండగా పోలీసులు ఆపేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. భూమి పత్రాలు చూపించినా వదల్లేదు. ఆటోతో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు. గంటల తరబడి స్టేషన్‌లోనే ఉంచారు.
మెరిట్ సాధించినా అన్యాయమే
నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థిని. రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాయడంతో మొదటి మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించా. జిల్లా స్థాయిలో 139వ ర్యాంకు సాధించాను. ఉద్యోగం గ్యారెంటీ అనుకున్న తరుణంలో నా పేరు ఫైనల్ లిస్ట్‌లో లేదు. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాను. తక్కువ జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంది. మానసిక ఆందోళనతో రోజూ ఇబ్బంది పడుతున్నా. నా ప్రతిభకు న్యాయం జరగాలని కోర్టుకు వెళ్దామంటే కనీసం లాయర్ ఫీజులు భరించే ఆర్థిక స్థోమత కూడా నాకు లేదు. మెరిట్ సాధించినా మా లాంటి పేద అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను.
– జుత్తుగ శ్రీనివాస్, ఉండ్రాజవరం, నిడదవోలు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా
ఫేక్ సర్టిఫికెట్లకే పెద్దపీట
కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు చదివి స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా జిల్లా స్థాయిలో 130వ ర్యాంకు సాధించాను. ప్రభుత్వం కేటాయించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో నేను ఉద్యోగానికి అర్హుడిగా నిలిచాను. అయితే నాకంటే తక్కువ అర్హత ఉండి, అక్రమ మార్గంలో ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందిన ఒక అభ్యర్థికి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం కట్టబెట్టారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా, నా వాదనల్లోని నిజాయతీని గుర్తించి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ ఆదేశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంతో నాలాంటి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.
– కరుటూరి వెంకట సతీష్, కాల్దారి, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా


