చండీగఢ్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో పంజాబ్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను చూపిస్తూ.. పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సంక్షోభం తీవ్రంగా ఉందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఆ వీడియో పంజాబ్‌కు చెందింది కాదని, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించిందని ఆప్ స్పష్టం చేయడంతో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. పంజాబ్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర యువతకు ఇంతకంటే మెరుగైన భవిష్యత్తు కావాలని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సమస్యపై నిజాయితీ, జవాబుదారీతనం, తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోను పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యపై ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ రాజకీయ అస్త్రంగా ఉపయోగించిందనే చర్చ మొదలైంది.
హర్భజన్ సింగ్‌పై మంత్రి బాల్జీత్ కౌర్ ఫైర్
బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ వ్యాఖ్యలకు పంజాబ్ కేబినెట్ మంత్రి డాక్టర్ బాల్జీత్ కౌర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. హర్భజన్ సింగ్ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన వీడియోను పంజాబ్ ఘటనగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీ రాజకీయ పెద్దలను సంతృప్తిపరచేందుకే హర్భజన్ సింగ్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తూ.. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అసలు వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న క్లిప్‌లో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన కనిపిస్తారు. వారు సరిగ్గా నిలబడలేకపోవడం, తడబడుతూ నడవడం, అయోమయంగా ప్రవర్తించడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో వారు మత్తు పదార్థాల వల్లే ఇలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వీడియోను ‘జాంబీ డ్రగ్’కు లింక్ చేస్తూ పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఆ వ్యక్తులు ఏదైనా మాదకద్రవ్యాన్ని తీసుకున్నారనే దానికి స్వతంత్రంగా ధ్రువీకరణ లేదు. అంతేకాదు.. ఈ ఘటన పంజాబ్‌లో కాకుండా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
డ్రగ్స్ అంశమే రాజకీయ అస్త్రంగా..
ఈ వీడియోతో మరోసారి పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య రాజకీయ చర్చకు వచ్చింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
మొత్తంగా.. రోడ్డుపక్కన ఇద్దరు వ్యక్తులు కనిపించిన ఓ వీడియోతో మొదలైన వ్యవహారం ఇప్పుడు పంజాబ్‌లో బీజేపీ-ఆప్ మధ్య మరో రాజకీయ పోరుగా మారింది. ఒకవైపు బీజేపీ దీన్ని రాష్ట్రంలోని డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉపయోగిస్తుండగా.. మరోవైపు ఆప్ మాత్రం వీడియో మూలాన్ని ప్రశ్నిస్తూ బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది.
Another case of "Zombie" drug. Video is from Sri ganganagar. pic.twitter.com/A39eRtGdbQ
— DesiEsco🇮🇳 (@DesiEsco7) August 9, 2026


