పార్టీనేతల మధ్య సయోధ్య.. సర్జరీ పూర్తయింది, లంచ్‌లు, డిన్నర్లు కూడా జరిగాయి
సినిమా పిచ్చి ఉన్నవారు కొంతమంది జనసేనలోకి పోతున్నారు
మీడియా చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులు, హామీల అమల్లో వెనుకడుగు, ఫీజు బకాయిలు తదితరాలపై ఉద్యమ కార్యాచరణ తీవ్రం చేయనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, విధానాలపై త్వరలోనే పాదయాత్ర, బస్సుయాత్ర ఇతర రూపాల్లో చేపట్టబోయే పోరుబాటపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈనెల 15 తర్వాత ‘క్యూర్’పై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని చెప్పారు. క్యూర్‌లో పన్నుల విధానం, కార్పొరేటర్ల పాత్ర, పట్టణ ప్రణాళిక, నీరు–మురుగునీటి వ్యవస్థలను వేరు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు, పన్నుల భారం వంటి ముఖ్యమైన విషయాలపై స్పష్టత కొరవడిందన్నారు.
సోమవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో రాంచందర్‌రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ’హిట్లర్, హిల్ట్, హైడ్రా’(త్రీహెచ్)తో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందన్నారు. హైడ్రా సెలక్టివ్‌గా అక్రమ కట్టడాలను ధ్వంసం చేస్తోందని, ఎంఐఎంకు సంబంధించిన వాటి విషయంలో చర్యలేవీ తీసుకోవడం లేదని ఆరోపించారు. ‘రేవంత్ వరుణయాగం చేస్తే.. మేము వారు కొట్టుకుపోవాలని వాయుయాగం చేస్తాం’అని నవ్వుతూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలు, పాలనా వైఫల్యాలతోనే అధికారులు కోర్టుల వద్ద పదే పదే మొట్టికాయలు తినాల్సి వస్తోందన్నారు.
పరిపాలనా వ్యవస్థ దెబ్బతిన్నప్పుడే న్యాయవ్యవస్థ అడుగుపెడుతుందనే నానుడిని నిజం చేస్తూ ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ నేతల సయోధ్య పూర్తయిందా అన్న ఓ విలేకరి ప్రశ్నకు ‘అది అయ్యింది.
సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కేర్ పూర్తయి లంచ్‌లు, డిన్నర్లు కూడా అయ్యాయి’అని నవ్వుతూ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి కొందరు జనసేనలో చేరుతున్నారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘సినిమా పిచ్చి ఉన్నవారు కొంతమంది జనసేనలో పోతున్నారు. వెళ్లిన వారిని అడిగితే నేను పవన్ ఫ్యాన్ అని అంటున్నారు. గతంలో ఎందుకు వెళ్లలేదు అని అడిగితే అప్పుడు జనసేన తెలంగాణలో లేదు కాబట్టి వెళ్లలేదు అని అన్నారు. వెళ్లే వారిని అడ్డుకోలేం కదా’అని రాంచందర్‌రావు బదులిచ్చారు.


