‘మీ ఇళ్ల కింద గుప్త నిధులు’ అంటున్న ముఠా.. గుట్టు రట్టు | Telangana Police Held Gang Of Hidden Treasure Scam | Sakshi
Sakshi News home page

‘మీ ఇళ్ల కింద గుప్త నిధులు’ అంటున్న ముఠా.. గుట్టు రట్టు

Aug 10 2026 8:08 PM | Updated on Aug 10 2026 8:15 PM

Telangana Police Held Gang Of Hidden Treasure Scam

హైదరాబాద్‌::  ‘ మీ ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి నగరంలో హల్‌చల్‌ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌.. ఈ ముఠాను విజయవంతంగా పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  

మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25),మహ్మద్ సల్మాన్ (29)లు ముఠాగా ఏర్పడి గుప్తా నిధులు ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ఉదంతం పోలీసుల దృష్టికి రావడంతో వారిని అత్యంత పకడ్బందీగా పట్టుకున్నారు. 

వీరి వద్ద నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత పూసిన నాణేలు, 6 కేజీల బొగ్గు, 4 కేజీల మట్టి, పూజా సామగ్రి తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.

ఇలా కొంతమందిని ముఠాగా ఏర్పరుచుకున్నాడు. వీరంతా కలిసి అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు.

ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి
‘ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.

హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది’ అని రాజేంద్ర నగర్‌-శంషాబాద్‌ జోన్స్‌  టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కేఎస్‌ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement