breaking news
hidden treasure
-
‘మీ ఇళ్ల కింద గుప్త నిధులు’ అంటున్న ముఠా.. గుట్టు రట్టు
హైదరాబాద్:: ‘ మీ ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి నగరంలో హల్చల్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ టీమ్.. ఈ ముఠాను విజయవంతంగా పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25),మహ్మద్ సల్మాన్ (29)లు ముఠాగా ఏర్పడి గుప్తా నిధులు ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ఉదంతం పోలీసుల దృష్టికి రావడంతో వారిని అత్యంత పకడ్బందీగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత పూసిన నాణేలు, 6 కేజీల బొగ్గు, 4 కేజీల మట్టి, పూజా సామగ్రి తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.ఇలా కొంతమందిని ముఠాగా ఏర్పరుచుకున్నాడు. వీరంతా కలిసి అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు.ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రజలకు విజ్ఞప్తి‘ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ఇన్స్పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది’ అని రాజేంద్ర నగర్-శంషాబాద్ జోన్స్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎస్ రావు తెలిపారు. -
గుప్తనిధులు నిజమా అబద్దమా ?
-
అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!
అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు. ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు. ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు. ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు. -
ఘంటామఠంలో గుప్త నిధులు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం చేపట్టిన తవ్వకాల్లో గుప్తనిధులు బయటపడ్డాయి. సుమారు 140 వెండి నాణేలు, 14 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, ఉంగరాలు, 2 వెండి చెంబులు లభ్యమయ్యాయి. దేవస్థానం సహాయ కమిషనర్ మహేశ్వరెడ్డి, తహసీల్దార్ విజయుడు, సీఐ పార్థసారధి, వన్టాన్ ఎస్ఐ వరప్రసాద్ దేవస్థానం పరిపాలన భవనంలో పంచనామా చేసి గుప్త నిధులను రికార్డులో నమోదు చేశారు. మూడు బంగారు కడియాలు, ఉంగరాలు మొత్తం 699 గ్రాముల 930 మిల్లీగ్రాములు.. వెండి నాణేలు ఇతర వస్తువులు కలిపి 2కేజీల 500 గ్రాములు ఉన్నట్లు సహాయ కమిష్నర్ మహేశ్వరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులు ఏ కాలానికి చెందినవనే విషయాన్ని పరిశీలించాలని పురావస్తు శాఖ అధికారులను కోరామన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
మోత్కూరు : నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి తాళాన్ని పగులగొట్టారు. శివలింగం పక్కన కొంత మేర తవ్వకాలు చేసిన అనంతరం ప్రయత్నం ఉపసంహరించుకుని వెళ్లినట్టు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆలయం ఆవరణ అంతా కారంపొడి చల్లి ఉంది. దీనిపై ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుప్తనిధులు కోసం క్షుద్రపూజలు
-
గుప్తనిధుల కోసం తవ్వకాలు
మహబూబ్నగర్ : పాత భవనాల కింద విలువైన సంపద దాగి ఉండొచ్చని భావించిన కొందరు దుండగులు తవ్వకాలు నిర్వహించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ గ్రామం ముంపునకు గురికావడంతో గ్రామస్థులంతా ఊరొదిలి కొత్త ప్రాంతానికి వలసవెళ్లారు. దీంతో పాడుబడ్డ గ్రామంగా గుర్తింపు చెందిన పల్లెపాడు క్రమంగా శిధిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో పాత భవనాలలో బంగారం, నగలు, విలువైన వస్తువులు లభిస్తాయనుకొని కొందరు గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులతో సహా ఘటనాస్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. -
చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం నరబలి


