హౌతీలకు బిగ్‌ షాక్‌.. పాక్‌ మతపెద్ద సంచలన వ్యాఖ్యలు | Pakistani Tahir Ashrafi Says Houthis Are enemies of Islam | Sakshi
Sakshi News home page

హౌతీలకు బిగ్‌ షాక్‌.. పాక్‌ మతపెద్ద సంచలన వ్యాఖ్యలు

Oct 2 2026 1:38 PM | Updated on Oct 2 2026 1:38 PM

Pakistani Tahir Ashrafi Says Houthis Are enemies of Islam

యెమెన్‌లో హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ మతపెద్ద హఫీజ్‌ మహమ్మద్‌ తాహిర్‌ మెహమూద్‌ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. వారికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీలు అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సౌదీ అరేబియాలోని మదీనా ఇస్లామిక్‌ యూనివర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా అష్రఫీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాక్‌ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (APP) వెల్లడించింది. సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న భావజాలపరమైన సవాళ్లపై నిర్వహించిన ఈ సదస్సులో ఆయన హౌతీలను తీవ్రంగా విమర్శించారు. హౌతీలు ఇస్లాం, పాలస్తీనా పేర్లను ఉపయోగించుకుంటున్నప్పటికీ.. వారి చర్యలకు ఇస్లామిక్‌ విలువలతో సంబంధం లేదని అష్రఫీ అన్నారు. సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ, ఇజ్రాయెల్‌ నౌకలకు మాత్రం మార్గం కల్పించారంటూ ఆరోపించారు. యెమెన్‌ ప్రజల భద్రత, విద్య, వైద్య రంగాల కోసం సౌదీ అరేబియా భారీగా సాయం చేస్తున్నప్పటికీ హౌతీలు దానిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

సౌదీకి పాక్‌ మద్దతు..
సౌదీ అరేబియాకు పాకిస్తాన్‌ అండగా నిలుస్తుందని అష్రఫీ స్పష్టం చేశారు. సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలోని రాజ్యానికి పాక్‌ ప్రభుత్వం, సాయుధ దళాలు, మతపెద్దలు, ప్రజలు పూర్తి మద్దతు ఇస్తారని అన్నారు. ఇస్లాం పేరుతో యువతను తప్పుదోవ పట్టించే తాలిబన్లు, అల్‌ఖైదా, ఐసిస్‌, హౌతీల వంటి సంస్థలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, హౌతీలపై సైనిక చర్య విషయంలో పాకిస్తాన్‌ ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటించినప్పటికీ, యెమెన్‌లో హౌతీలపై దాడులు చేయాలన్న పిలుపులపై ఇస్లామాబాద్‌ గతంలో వెనుకడుగు వేసింది. పాకిస్తాన్‌ సైన్యం చర్యలు సౌదీ భూభాగాన్ని రక్షించడానికే పరిమితమవుతాయని అక్కడి రక్షణ మంత్రి పేర్కొన్నట్లు గత నివేదికలు వెల్లడించాయి.

గతంలోనూ వివాదాల్లో అష్రఫీ
అష్రఫీ ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. 2026 సెప్టెంబర్‌ 11న మత సామరస్యం, సయోధ్యకు సంబంధించిన హ్యూబర్ట్‌ వాల్టర్‌ అవార్డును కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ సారా ముల్లాలీ నుంచి అందుకున్నారు. అయితే, 2007లో అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్‌ 17న ఆ అవార్డును వెనక్కి తీసుకున్నారు. రష్యన్లు, అమెరికన్లు, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఇస్లాం కోసం పోరాడిన వ్యక్తిగా బిన్‌ లాడెన్‌ను ఆయన అప్పట్లో అభివర్ణించినట్లు బీబీసీ నివేదించింది. అంతేకాకుండా, దైవదూషణ ఆరోపణలను ఉపయోగించి వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ముఠాకు అష్రఫీ రక్షణ కల్పించారని ది టెలిగ్రాఫ్‌ పత్రిక సెప్టెంబర్‌ 24న కథనం ప్రచురించింది. ఆ ముఠాకు ఆయన సోదరుడు నాయకత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. 

ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్‌ ఘటనపై బిగ్‌ బ్లాస్ట్‌.. ఇరాన్‌ సంచలన ఆరోపణలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement