పశ్చిమాసియాను మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొత్త దాడులకు అవకాశం కచ్చితంగా ఉందని ట్రంప్ చెప్పడం.. పైగా గల్ఫ్ ప్రాంతానికి భారీగా సైనిక బలగాలను తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలగాలే గనుక చేరుకుంటే మిడిల్‌ఈస్ట్‌లో అమెరికా సైనిక ఉనికి గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.
దాదాపు 9 వేల మంది సైనికులు, మెరైన్లను యుద్ధ నౌకల సమూహంతో కలిసి మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ బలగాల తరలింపు సాధారణ మోహరింపు కాదని, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలకు అదనంగా ఈ కొత్త దళాలు చేరితే.. మధ్యప్రాచ్యంలో అమెరికా నావికాదళ ఉనికి మరింత బలపడనుంది. మొత్తం మీద 20 వేల మందికి పైగా సైనికులు, వందలాది యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో అమెరికా సైనిక శక్తి ఈ ప్రాంతంలో అత్యున్నత స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఇటీవలి ప్రాంతీయ దాడుల నేపథ్యంలో ఈ మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు చర్చలకు తాము సిద్ధమంటూ ఇరాన్ సంకేతాలు ఇస్తుండగా.. మరోవైపు అమెరికా సైనిక బలగాలను పెంచడం పశ్చిమాసియాలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠను పెంచుతోంది.
మూడు విమాన వాహక నౌకలతో సిద్ధం
అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యూఎస్‌ఎస్ మాకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్ పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వీటిలో వేలాది మంది నావికులు, మెరైన్లు ఉన్నారు. ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రాంతంలో మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉండే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యూఎస్‌ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్ క్యారియర్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయి. 2003 తర్వాత.. తొలిసారిగా ఒకేసారి మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ఆ రీజియన్‌లో ఉండే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు.
ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఘటనలో కో–పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ ట్రంప్ హెచ్చరించారు. ‘‘వారిపై చాలా తీవ్రంగా దాడి జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వరకు ఆగుతారా?
నవంబర్ 3న జరగనున్న అమెరికా ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ‘‘అది సాధ్యమే’’ అని సమాధానం ఇచ్చారు. ఇరాన్ ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరవాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మొత్తం ఒప్పందం తనకు ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే.. ఎన్నికల వరకు అమెరికా వేచి చూస్తుందా? లేక అంతకుముందే సైనిక చర్యకు దిగుతుందా? అనే చర్చ మొదలైంది.
హార్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి
ఇదిలా ఉండగా, ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో 25 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న సూపర్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది. ఘటనలో నౌకలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.
ఇరాన్ మరోలా..
మరోవైపు ఇరాన్ అమెరికాతో చర్చలకు తాము ఎప్పుడూ దూరంగా లేమని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. చర్చల సమయంలోనే తమపై మూడుసార్లు దాడులు జరిగాయని ఆరోపించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సీనియర్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా నక్దీ మాత్రం అమెరికా ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
అమెరికా భారీ సైనిక మోహరింపు, ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు, హార్ముజ్ పరిణామాలు.. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అనూహ్యంగా మధ్యవర్తులు ఎంట్రీ ఇచ్చి ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలను తెరపైకి తెస్తారా? లేదంటే మరోసారి సైనిక ఘర్షణ దిశగా పరిస్థితులు వెళ్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. అంతుచిక్కని ప్రశ్నలివే!


