ఫ్లైదుబాయ్‌ ట్విస్ట్‌: ఇంతకీ ఆ కో-పైలట్‌ ఎవరంటే.. | Flydubai Flight Incident: Who Is the Co Pilot Motive Read Full details Here | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ ట్విస్ట్‌: పైలట్‌పై దాడి చేసిన కో-పైలట్‌ ఎవరంటే..

Oct 1 2026 9:22 AM | Updated on Oct 1 2026 10:03 AM

Flydubai Flight Incident: Who Is the Co Pilot Motive Read Full details Here

ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా నిలిచిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ ప్రాణాలకు తెగించి పోరాడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అతనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇంతటి ప్రమాదకర చర్యకు పాల్పడిన కో-పైలట్‌ ఎవరు? అతడి ఉద్దేశం ఏమిటి? అనే మిస్టరీ ఇంకా వీడలేదు.

ఇజ్రాయెల్‌ అధికారుల ప్రకారం.. దాడికి పాల్పడిన కో-పైలట్‌ ఒమన్‌ జాతీయుడు. అతడి పూర్తి పేరును మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఫ్లైదుబాయ్‌లోనే పనిచేస్తున్న అతడు.. సంస్థలో చేరి ఏడాది కూడా కాలేదని తెలుస్తోంది. అయితే ఏ ఉద్దేశంతో దాడి చేశాడన్నది కూడా తెలియరాలేదు. ఘటన తర్వాత సౌదీ అరేబియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల సహకారంతో అతన్ని ప్రశ్నిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తెలిపారు. ఫ్లైదుబాయ్‌ ప్రకారం.. ఘటనకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అందువల్ల కో-పైలట్‌ ఉద్దేశం గురించి ముందస్తు ఊహాగానాలు చేయొద్దని సంస్థ హెచ్చరించింది. 

నెతన్యాహు ఏమన్నారంటే..
ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. కో-పైలట్‌ మొదట కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి.. అనంతరం విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని వివరించారు. విమానంలో మొత్తం 174 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌ పౌరులేనని తెలిపారు.

స్మిట్‌ మచ్చార్‌ తీవ్రంగా గాయపడినా చివరి శక్తిని ఉపయోగించి కాక్‌పిట్‌ తలుపు తెరిచారని నెతన్యాహు కార్యాలయ ప్రతినిధి డోరన్‌ స్పీల్‌మన్‌ తెలిపారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారని చెప్పారు. నెతన్యాహు స్వయంగా స్మిట్‌ మచ్చార్‌ను “నిజమైన హీరో”గా అభివర్ణించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 174 మంది ప్రాణాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

ట్రంప్‌ ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఈ ఘటనపై నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం ఓవల్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెతన్యాహు నుంచి తనకు అందిన వివరాలను చెప్పారు.  విమానంలో ఉన్న ఓ ఇజ్రాయెలీ ప్లంబర్‌ కాక్‌పిట్‌లోకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించాడు. కో-పైలట్‌ విమాన నియంత్రణ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అతడు “టెర్రరిస్ట్‌ అయి ఉండొచ్చు.. లేదంటే మరేదైనా కారణం ఉండొచ్చు” అనే అర్థంలో వ్యాఖ్యానించారు. ఇటు ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ను మాత్రం ట్రంప్‌ అభినందించారు.

ఇజ్రాయెల్‌ బలగాలు ఏం చెప్పాయి?
ఇజ్రాయెల్‌ అధికారులు ఈ ఘటనను తీవ్రమైన భద్రతా ఘటనగా అభివర్ణించారు. కో-పైలట్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేసిన తర్వాత విమానం దాదాపు 14 వేల అడుగుల మేర అత్యంత వేగంగా కిందకు దిగిపోయిందని చెప్పారు. ఈ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం విమానంలో ఉన్న మరో జంట ఫ్లైదుబాయ్‌ పైలట్లు బాధ్యతలు చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. రక్తస్రావంతో నేలపై పడిపోయిన స్మిట్‌ మచ్చార్‌ తన మిగిలిన శక్తినంతా ఉపయోగించి కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. లోపలికి వెళ్లిన ప్రయాణికులు కో-పైలట్‌ కంట్రోల్‌ ప్యానెల్‌పై దాడి చేస్తున్నట్లు చూశారని అధికారులు వివరించారు.

హైజాకింగ్‌? లేదంటే..
ఇక్కడే అసలు మిస్టరీ కొనసాగుతోంది. నెతన్యాహు ప్రకారం ఇది సాధారణ హైజాకింగ్‌ ఘటనలా కనిపించడం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కో-పైలట్‌ విమానం నడపడానికి ప్రయత్నించకుండా కంట్రోల్‌ ప్యానెల్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశాడట. ఓ ప్రయాణికుడు ఇచ్చిన వాంగ్మూలాన్నే నెతన్యాహు ప్రస్తావించారు. అందువల్ల ఇది ఆత్మహత్యా ప్రయత్నం కావొచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేశారాయన. 

తనిఖీలు ముమ్మరం
ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌ భద్రతా అధికారులు విదేశీ విమానాల పైలట్లపై తనిఖీలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల పైలట్ల గుర్తింపును ముందుగానే తెలుసుకుని, భద్రతా ప్రక్రియలను మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంతో.. ఇజ్రాయెల్‌కు అన్ని సర్వీసులను ఫ్లైదుబాయ్‌ రద్దు చేసింది.

అలా.. కో-పైలట్‌ ఎవరు? ఎందుకు స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేశాడు? విమానాన్ని నిజంగానే కూల్చాలనుకున్నాడా? ఉగ్రవాద కోణముందా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో ఏమైనా సంబంధముందా? అన్న ప్రశ్నలకు ఇంకా పూర్తిస్థాయి సమాధానాలు రావాల్సి ఉంది. 

ఇదీ చదవండి: నువ్వు రియల్‌ హీరో బ్రో.. భారత పైలట్‌పై ప్రశంసల జల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement