9/11 తరహా దాడికుట్ర భగ్నం!  | Indian Captain Fought Co-Pilot to Prevent Plane Crash | Sakshi
Sakshi News home page

9/11 తరహా దాడికుట్ర భగ్నం! 

Oct 1 2026 6:36 AM | Updated on Oct 1 2026 6:36 AM

Indian Captain Fought Co-Pilot to Prevent Plane Crash

174 మంది ప్రయాణికులున్న విమానాన్ని కూల్చేందుకు యత్నించిన కో–పైలట్‌

మెరుపువేగంతో స్పందించి అడ్డుకున్న భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌

కుట్రను అడ్డుకున్న కెప్టెన్‌కు కత్తిపోట్లు 

ఘర్షణ చూసి వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకొచ్చిన ప్రయాణికులు 

కత్తితో దాడిచేసిన కో–పైలట్‌ను బంధించిన విమానసిబ్బంది, ప్రయాణికులు 

విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌చేసిన అదే విమానంలోని ఆఫ్‌–డ్యూటీ పైలట్లు 

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో మార్గమధ్యంలో అనూహ్య ఘటన 

సౌదీఅరేబియాలో సురక్షితంగా ల్యాండింగ్‌ 

ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు 

ఘటనను ఉగ్రదాడిగా అభివరి్ణంచిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ 

క్రాష్‌ల్యాండింగ్‌ను నిలువరించిన కెప్టెన్‌పై కురుస్తున్న ప్రశంసల జల్లు 

కో–పైలట్‌ను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్న సౌదీ పోలీసులు

దుబాయ్‌/జెరూసలేం: అమెరికాలో రెండు దశాబ్దాల క్రితం విమానాన్ని హైజాక్‌చేసి ఆకాశహర్మ్యాలను ఢీకొట్టి వందలాది మంది చావుకు కారణమైన సెప్టెంబర్‌ 11 దాడుల తరహాలో ప్రయాణికుల విమానాన్ని తన వశం చేసుకుని కుప్పకూల్చేందుకు ఒక కోపైలట్‌ దుస్సాహసం చేసిన ఉదంతం జోర్డాన్‌ గగనతలంలో జరిగింది. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేందుకు కోపైలట్‌ చేసిన ప్రయత్నాన్ని ఒక భారతీయ కెప్టెన్‌ అత్యంత ధైర్యసాహసాలతో వమ్ముచేశారు.

 కత్తిపోట్లకు గురైనా సరే విమానం కోపైలట్‌ చేతుల్లోకి వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్నాడు. దీంతో ప్రయాణికులందరి ప్రాణాలు నిలబడ్డాయి. రక్తమోడుతున్న కెప్టెన్‌ కుప్పకూలడం, అదే సమయానికి కాక్‌పిట్‌లోకి దూసుకొచ్చిన ప్రయాణికులు కోపైలట్‌ను నిలువరించడం, అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు వెంటనే సమయస్ఫూర్తితో విమానాన్ని తమ అదీనంలోకి తెచ్చుకుని సౌదీఅరేబియాలో సురక్షితంగా ల్యాండ్‌చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. 

దీంతో క్రాష్‌ల్యాండింగ్‌ వంటి మారణహోమంతో ముగియాల్సిన ఈ ఉదంతం అనూహ్యంగా సుఖాంతంగా పరిసమాప్తి అయింది. కత్తితో దాడికి పాల్పడిన కోపైలట్‌ను సౌదీలో అరెస్ట్‌చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్‌ శివారు గ్రామాలపై హమాస్‌ సాయుధులు మెరుపుదాడిచేసి వందలాది మంది ఇజ్రాయెలీలను అంతంచేసిన ఘటన జరిగి మరో వారంలో మూడేళ్లు పూర్తవుతున్న వేళ ఈ విమాన హైజాక్‌ ఘటన జరగడం గమనార్హం. 

అసలేం జరిగింది? 
దర్యాప్తు సంస్థలు, ప్రత్యక్షసాక్షులైన ప్రయాణికులు, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బుధవారం ఉదయం 6.05 గంటలకు ఫ్లైదుబాయ్‌ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌737 మ్యాక్స్‌ రకం ఎఫ్‌జెడ్‌1073 నంబర్‌ విమానం 27 మంది చిన్నారులుసహా 174 మంది ప్రయాణికులతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ సమీప బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరింది. 

దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం జోర్డాన్‌ గగనతలానికి చేరుకుంది. ఉదయం 8.31 గంటలప్పుడు విమానం 34,000 అడుగుల ఎత్తులో వెళ్తోంది. అదే సమయంలో కోపైలట్‌గా ఉన్న వ్యక్తి విమానాన్ని తన అధీనంలోకి తీసుకుని కుప్పకూల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానం హఠాత్తుగా 30 సెకన్లలోనే 20వేల అడుగుల కిందకు జారిపోయింది. ఇది గమనించిన కెప్టెన్‌ వెంటనే అతని చర్యను అడ్డుకున్నాడు. 

ఈ క్రమంలో విమానం గుండ్రంగా తిరిగి 5,000 అడుగులుపైకి, మళ్లీ 7,000 అడుగులు కిందకు జారింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేయడం మొదలెట్టారు. తనను అడ్డుకున్న కెప్టెన్‌ను కోపైలట్‌ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అయినాసరే కోపైలట్‌ దుశ్చర్యను కెప్టెన్‌ అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించాడు. ‘విమానం పడిపోవచ్చు. ఎవరైనా వచ్చి నాకు సాయంచేయండి’’అని కెప్టెన్‌ అరిచాడు. దీంతో కాక్‌పిట్‌లో గొడవ జరుగుతున్న విషయం గమనించి ముందు వరసలో కూర్చున్న ఇజ్రాయెల్‌ ప్రయాణికులు, విమాన సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌లోకి పరుగెత్తారు.

 కత్తితో దాడిచేస్తున్న కోపైలట్‌ను పట్టుకుని కిందకు అదిమిపట్టారు. అయినాసరే విమానంలోని భద్రతావ్యవస్థలను కోపైలట్‌ నాశనంచేసేందుకు యత్నించగా అందరూ కలిసి అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు సైతం రక్తంమరకలు అంటాయి. ఇదంతా చూసిన వెనకవైపు కూర్చున్న డ్యూటీలో లేని ఇద్దరు యూరప్, బ్రిటన్‌కు చెందిన పైలట్లు సమయస్ఫూర్తితో వెంటనే కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని తమ అ«దీనంలోకి తెచ్చుకున్నారు. ఇదంతా జరిగేలోపే కెప్టెన్‌ విమానం నుంచి 7700 కోడ్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది సాధారణ ఎమర్జెన్సీకి సంబంధించిన సిగ్నల్‌. వెనువెంటనే 7500 కోడ్‌ ఇచ్చాడు. 

ఇది హైజాక్‌ లేదా అనధికారంగా విమానాన్ని తమ వశం చేసుకోవడానికి సంబంధించిన సిగ్నల్‌. ఈ సిగ్నల్‌ అందుకున్న ఇజ్రాయెల్‌ వాయుసేన వెనువెంటనే తన అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను ఈ విమానానికి తోడుగా పంపింది. పైలట్లు విమానాన్ని 9.45 గంటలకు సౌదీ అరేబియాలోని తబుక్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. రక్తమోడుతున్న కెప్టెన్‌ను వెంటనే ఆస్పత్రిలో చేరి్పంచారు. దాడిచేసిన కోపైలట్‌కు సైతం గాయా లయ్యాయని, ఇతడిని ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్సచేయించాక అరెస్ట్‌చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని సౌదీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇతను ఒమన్‌ దేశస్తుడని 
వార్తలొచ్చాయి.

హీరో కెప్టెన్‌ 
కోపైలట్‌తో వీరోచితంగా పోరాడి అందర్నీ కాపాడిన పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై అభినందనల వర్షం కురిసింది. ఈయన గతంలో స్పైస్‌జెట్‌లో పనిచేశారు. తర్వాత 2022లో ఫ్లైదుబాయ్‌ సంస్థలో చేరారు. ఈయనకు పైలట్‌గా 13 ఏళ్ల అనుభవం ఉంది. ఏకంగా 9,750 గంటలకుపైగా విమానం నడిపారు. విమానసిబ్బంది వనరుల నిర్వహణలో, విమాన ప్రమాణాలు, నిబంధనలను పాటించడంలో, బోయింగ్‌ 737 రకం విమానాలను నడపడంలో నిష్ణాతుడు.

చచ్చిపోతాననుకున్నా... 
విమానం వేగంగా కిందకు పడిపోతున్న దృశ్యాలను భయపడుతూనే అందులోని ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ‘‘చచ్చిపోతాననుకున్నా. విమానం ఇష్టమొచ్చినట్లు గాల్లో గింగిరాలు తిరిగింది. బతుకుతాననుకోలేదు’’అని ఒక ప్రయాణికురాలు ఏడుస్తూ చెప్పింది. ‘‘దాడికి యత్నించిన ఉగ్రవాదిని పట్టుకున్నాం. ఇప్పుడు విమానం ల్యాండ్‌కాబోతోంది. 

ఈ ప్రాంతం సౌదీ అనుకుంటున్నా’’అని ముఖంపై రక్తం మరకలున్న ఒక ప్రయాణికుడు సెల్ఫీ వీడియోను పోస్ట్‌చేశారు. ‘ఐదుగురు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి సాహసోపేతంగా వ్యవహరించడంతో ఇప్పుడు మేమంతా బతికిబయటపడ్డాం’’అని దలియా పిగెల్‌ అనే ప్రయాణికుడు చెప్పారు. సౌదీలో దిగిన అదే విమానం రాత్రికల్లా గమ్యస్థానమైన ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. 

ప్రయాణికులను పొగిడిన నెతన్యాహూ... 
ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. ‘‘ఇది ఉగ్రదాడే. ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇజ్రాయెలీలే ఉన్నారు. వీళ్లను చంపేందుకు కోపైలట్‌ విమానాన్ని కుప్పకూల్చాలని పథకం పన్నాడు. ఈ కుట్రను ఇజ్రాయెలీ ప్రయాణికులు విజయవంతంగా వమ్ముచేశారు. అత్యంత సాహసోపేతంగా కోపైలట్‌ను పట్టుకుని మీకు సెల్యూట్‌. క్రాష్‌ల్యాండింగ్‌ కాకుండా అందర్నీ కాపాడిన మీరంతా హీరోలే. కోపైలట్‌ను సౌదీ అధికారులు ప్రశ్నిస్తున్నారు’’అని నెతన్యాహూ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement