అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాహనదారులకు ఇంధన ధరల రూపంలో మరోసారి షాక్ తగిలింది. అక్టోబర్ నెలకు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ యూఏఈ ఇంధన ధరల కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అన్ని రకాల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
అక్టోబర్‌లో సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 4.40 దిర్హమ్‌లకు చేరింది. సెప్టెంబర్‌లో ఇది 3.80 దిర్హమ్‌లుగా ఉండగా.. లీటరుకు 0.60 దిర్హమ్ పెరిగింది. అంటే సుమారు 15.8 శాతం పెరుగుదల. ఇక స్పెషల్ 95 పెట్రోల్ ధర 3.69 దిర్హమ్‌ల నుంచి 4.28 దిర్హమ్‌లకు చేరింది. దీంతో లీటరుకు 0.59 దిర్హమ్ పెరగ్గా.. పెరుగుదల సుమారు 16 శాతంగా నమోదైంది.
అదేవిధంగా ఈ-ప్లస్ 91 పెట్రోల్ ధర 3.61 దిర్హమ్‌ల నుంచి 4.21 దిర్హమ్‌లకు పెరిగింది. లీటరుకు 0.60 దిర్హమ్ పెరగడంతో ఇది 16.6 శాతం పెరిగింది. డీజిల్ ధర కూడా 4.30 దిర్హమ్‌ల నుంచి 4.80 దిర్హమ్‌లకు చేరింది. అంటే లీటరుకు 0.50 దిర్హమ్ పెరుగుదలతో 11.6 శాతం అధికమైంది.
ప్రపంచ చమురు ధరల ప్రభావం
యూఏఈలో ఇంధన ధరలను ప్రతి నెలా సమీక్షించి సవరించే విధానం అమల్లో ఉంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుని వచ్చే నెలకు సంబంధించిన రిటైల్ ధరలను నెలాఖరులో ఇంధన ధరల కమిటీ ప్రకటిస్తుంది. అక్టోబర్ ధరలు కూడా ఈ నెలవారీ ధరల విధానం కిందనే నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
కాగా సెప్టెంబర్‌లో కూడా యూఏఈలో ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా అక్టోబర్‌లో మరింత భారీగా పెరగడంతో వరుసగా రెండో నెలలోనూ వాహనదారులపై ఇంధన భారం పెరిగింది. ఈ-ప్లస్ 91 పెట్రోల్‌లో 16.6 శాతం పెరుగుదల నమోదవడం అక్టోబర్ నెలలో అన్ని ఇంధన రకాలలో అత్యధికం.


