సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాదిలో కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. తాజాగా 5 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో రాయల్ చైన్, ఎవర్‌బ్రాండ్స్ ఇండియా, జేబీ ఎకోటెక్స్, స్టాక్‌గ్రో, టెక్నోపెయింట్స్ చేరాయి. వివరాలు చూద్దాం..
జ్యువెలరీ కంపెనీ
బంగారు ఆభరణ తయారీ, విక్రేత రాయల్ చైన్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 850 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 150 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. సాంకేతిక ఆధారిత ఒరిజినల్ డిజైన్ తయారీ(ఓడీఎం)తో బంగారు ఆభరణాలు రూపొందించే కంపెనీ ప్రధాన కస్టమర్లలో జ్యువెలరీ దిగ్గజాలు టైటాన్, కల్యాణ్, పీఎన్ గాడ్గిల్, సెంకో గోల్డ్, కళామందిర్ జ్యువెలర్స్, తంగమాయిల్ తదితరాలున్నాయి. రికో, సార్, అనమిత్ర, ఆలిషాన్, ఇండిగో తదితర సొంత బ్రాండ్లను సైతం కలిగి ఉంది.
సబ్‌వే రెస్టారెంట్లు
సబ్‌వే రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ ఎవర్‌బ్రాండ్స్ ఇండియా ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 327 కోట్లు కొత్త సబ్‌వే స్టోర్ల ఏర్పాటుపై వెచ్చించనుంది. మరో రూ. 125 కోట్లు సొంత అనుబంధ సంస్థ కలినరీ బ్రాండ్స్ ఇండియా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. గతంలో కలినరీ బ్రాండ్స్‌గా కార్యకలాపాలు కలిగిన కంపెనీ సొంత బ్రాండు ఫ్రెష్ అండ్ హానెస్ట్‌కాగా.. సబ్‌వే, లవజ్జా, దిల్మా బ్రాండ్లను కలిగి ఉంది.
స్టాక్‌గ్రో బ్రాండ్‌తో
స్టాక్ మార్కెట్ రీసెర్చ్, అడ్వయిజరీ ప్లాట్‌ఫామ్ స్టాక్‌గ్రో మాతృ సంస్థ అసెట్‌గ్రో ఫిన్‌టెక్ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లమధ్య సమీకరించనుంది. అయితే ఇందుకు గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో ప్రస్తుతం ఇష్యూ వివరాలు అందుబాటులో లేవు. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిధులకు ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: నమో భారత్ రైళ్లలో ట్రిప్ పాస్
పెట్ బాటిల్స్ రీసైక్లింగ్
ప్రధానంగా పెట్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేసే జేబీ ఎకోటెక్స్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.29 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 320 కోట్లను కంపెనీతోపాటు, అనుబంధ సంస్థకు చెందిన రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2012లో ఏర్పాటైన కంపెనీ పెట్ బాటిల్స్ రీసైక్లింగ్‌సహా రీసైకిల్డ్ పెట్ ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని వివిధ ప్యాకేజింగ్‌లలో వినియోగిస్తారు.
ఇదీ చదవండి: ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జోరు.. కీలక మైలురాయి
పెయింట్స్, కోటింగ్స్
పెయింట్లు, కోటింగ్స్ తయారీ కంపెనీ టెక్నోపెయింట్స్ అండ్ కెమికల్స్ ఐపీవో ద్వారా రూ. 500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 175 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.


