భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 22,620 స్థాయికి చేరుకోగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 72,480 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అస్థిరతలు, ఇంధన ధరల తీవ్రత, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
ఇటీవల సూచీలు పతనమవ్వడానికి కారణాలు(అంచనా)
క్రూడ్ ఆయిల్ ధరల మంట
మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో ఇరాన్-అమెరికా మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో నౌకాయాన మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పునప్రారంభం, కాల్పుల విరమణ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించడంతో ఉద్రిక్తతలు ముదిరిపోయాయి. ఫలితంగా ముడి చమురు (బ్రెంట్ క్రూడ్) ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి సమీపిస్తూ పీపా (బ్యారెల్) ఇటీవల 104 డాలర్ల మార్కును దాటేశాయి. భారతదేశం తన చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడ్ ఆయిల్ పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచి, స్టాక్ మార్కెట్లలో భయాందోళనలను రేకెత్తించింది.
అమెరికా బాండ్ ఈల్డ్‌ల పెరుగుదల
అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు మళ్లీ గరిష్ఠ స్థాయికి ఎగబాకడం ఈక్విటీ మార్కెట్లకు పెద్ద సవాలుగా మారింది. యూఎస్ 10-ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 5.2 శాతానికి పైగా నమోదు కాగా 30-ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.5 శాతాన్ని తాకాయి. బాండ్ ఈల్డ్‌లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు ఈక్విటీల కంటే ప్రభుత్వ బాండ్లలో సురక్షితమైన, స్థిరమైన రాబడి లభిస్తుంది. దీనివల్ల రిస్క్ ఉండే ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకుని బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామం నూతన ఇన్వెస్ట్‌మెంట్లను అడ్డుకోవడమే కాకుండా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు
భారత మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరంతరం అమ్మకాల బాట పట్టడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక సవాళ్లు, అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో వారు భారతీయ ఈక్విటీల నుంచి పెద్దమొత్తంలో లాభాలు స్వీకరిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నెట్ సెల్లర్లుగా మారి విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్‌ను పూర్తిగా నిలబెట్టలేకపోయాయి. ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
రూపాయి విలువ పతనం
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలపడటం, చమురు దిగుమతి వ్యయం పెరగడంతో రూపాయి విలువ పడిపోయింది. బలహీనపడిన రూపాయి దేశీయ కంపెనీల దిగుమతి వ్యయాన్ని పెంచి వారి లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, దిగుమతి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే పాలసీ సమావేశాల్లో వడ్డీ రేట్ల కోత విరామం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మార్కెట్‌ను నిరాశపరిచింది.
గ్లోబల్ మార్కెట్ల మందగమనం
ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు నిఫ్టీలో అత్యంత కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో భారీగా విక్రయాలు జరగడం నిఫ్టీని 22,620 వద్దకు దిగజార్చింది.
ఇప్పుడేం చేయాలి?
రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహం ఆధారంగానే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని రెలిగేర్, జియోజిత్ ఆర్థిక విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ అస్థిరతల సమయంలో అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన షేర్లపై దృష్టి సారించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!


