పెట్రోల్‌తోపాటు వాటర్‌ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్‌ | Indian Oil Launch Packaged Drinking Water Fuel Outlets You Need to Know | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌తోపాటు వాటర్‌ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్‌

Sep 30 2026 1:40 PM | Updated on Sep 30 2026 1:47 PM

Indian Oil Launch Packaged Drinking Water Fuel Outlets You Need to Know

దేశంలోనే అతిపెద్ద చమురు విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఎసీఎల్‌) తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన 43,000కు పైగా రిటైల్ అవుట్‌లెట్ల భారీ నెట్‌వర్క్‌‌ను వినియోగించుకుంటూ ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది.

ఇంధనేతర ఆదాయమే ప్రధాన లక్ష్యం

ఐఓసీఎల్ ప్రస్తుతం వార్షికంగా ఉన్న రూ.200 కోట్ల ఇంధనేతర (నాన్‌ ఫ్యుయెల్‌) రాబడిని ఏకంగా రూ.760 కోట్లకు పెంచుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా స్థూల మార్కెట్ విలువను రూ.11,000 కోట్లకు పైగా చేరుకోవాలని భావిస్తోంది. రోజువారీగా దాదాపు 3.2 కోట్లకు పైగా వినియోగదారులు సందర్శించే 19.5 కోట్ల చదరపు అడుగుల ఐఓసీఎల్ అవుట్‌లెట్ స్పేస్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

హైవే అవుట్‌లెట్లపై ప్రత్యేక దృష్టి

మొత్తం నెట్‌వర్క్‌లో దాదాపు సగం, అంటే 21,435 హైవే అవుట్‌‌లెట్లు ఈ వాటర్ బాటిళ్ల విక్రయంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రయాణికులకు తాగునీటి అవసరం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ముందుగా ప్రారంభించి ఆపై అర్బన్, సెమీ-అర్బన్ బంకులకు విస్తరించనున్నారు. ప్రారంభంలో 250 ఎంఎల్‌, 500 ఎంఎల్‌, ఒక లీటర్ పెట్‌ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో ప్రీమియం వాటర్, నేచురల్ మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఫంక్షనల్ హైడ్రేషన్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది.

అగ్రిగేటర్ల భాగస్వామ్యం

ఈ బిజినెస్ మోడల్ కోసం ఐఓసీఎల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) దాఖలు చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, సప్లై చైన్, లాజిస్టిక్స్ బాధ్యతలను మల్టీ-ఇయర్ మోడల్‌లో ఎంపిక చేసిన అగ్రిగేటర్లు చూసుకుంటారు. అయితే, బ్రాండ్ యాజమాన్యం, ప్రొడక్ట్ ప్రైసింగ్, డీలర్ మార్జిన్లపై పూర్తి నియంత్రణ మాత్రం ఐఓసీఎల్ వద్దే ఉంటుంది.

భారీ మార్కెట్

ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, భారతదేశ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ 2025 నాటికి రూ.32,040 కోట్లకు చేరగా 2032 నాటికి ఇది రూ.57,850 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే హెచ్‌యూఎల్, డాబర్, పీవీఆర్ వంటి దిగ్గజాలతో భాగస్వామ్యం కలిగిన ఐఓసీఎల్ తాజా నిర్ణయంతో ప్యాకేజ్డ్ వాటర్ రంగంలో తన మార్కెట్ వాటాను గణనీయంగా దక్కించుకునేందుకు చర్యలు చేపడుతోంది.

ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement