హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు అక్కడి స్టాఫ్ ‘మినరల్ వాటరా, రెగ్యులర్ వాటరా?’ అని అడగడం చూస్తూంటాం. సాధారణంగా కస్టమర్లు సంకోచంతోనో, సమాచారం లేకనో ఖరీదైన బాటిల్ వాటర్‌ను ఎంచుకుంటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ వ్యాపార ధోరణిపై మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) చర్యలు చేపట్టింది.
ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రాథమిక హక్కు అని రాష్ట్ర ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఇకపై ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా వినియోగదారుడిని బాటిల్ వాటర్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదు. అడగకుండానే ముందే ఉచిత తాగునీటిని అందించాలని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు.. సూచనలు
రెస్టారెంట్లలో ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉందనే సమాచారాన్ని వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి.
నూనె పదార్థాలను వార్తాపత్రికలపై పెట్టి ఇవ్వడం పూర్తిగా నిషేధించారు. ఫుడ్-గ్రేడ్ ప్యాకేజింగ్ మాత్రమే వాడాలి.
సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమం శిక్షణను నిర్బంధం చేశారు. వంటనూనెలను పదే పదే వాడటంపై ఆంక్షలు విధించారు.
హోటల్ లేదా రెస్టారెంట్ ప్రవేశ ద్వారం వద్ద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను స్పష్టంగా ప్రదర్శించాలి.
ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..


