మాయావతికి తీరని లోటు.. బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే కన్నుమూత | BSP UP MLA Umashankar Singh Passes Away After Battle With Brain Tumor | Sakshi
Sakshi News home page

మాయావతికి తీరని లోటు.. బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే కన్నుమూత

Aug 6 2026 8:37 AM | Updated on Aug 6 2026 10:10 AM

BSP MLA Umashankar Singh Dies In UP

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ (55) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్)తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉమాశంకర్ సింగ్ బుధవారం రాత్రి సుమారు 8.30 గంటలకు మరణించినట్లు బీఎస్పీ ఆజమ్‌గఢ్‌, గోరఖ్‌పూర్ జోనల్ కోఆర్డినేటర్ మదన్ రామ్ తెలిపారు. ఉమాశంకర్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమాశంకర్ సింగ్ బల్లియా జిల్లా రస్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమాశంకర్ సింగ్ మృతి ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఉమాశంకర్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్రంగా బాధించిందని, పార్టీకి ఆయన చేసిన సేవలు, విధేయత ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఉమాశంకర్ సింగ్‌ను నిజాయితీ గల, అంకితభావంతో పనిచేసిన పార్టీ నేతగా మాయావతి అభివర్ణించారు. బీఎస్పీ పట్ల ఆయన చూపిన నిబద్ధతను ఎంత ప్రశంసించినా తక్కువేనని పేర్కొన్నారు. చికిత్స సమయంలో ఉమాశంకర్ సింగ్ కుమారుడితో తాను నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు మాయావతి తెలిపారు. ఆయన మరణ వార్తను కూడా కుమారుడి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజకీయ ప్రస్థానం.. 
ఉమాశంకర్ సింగ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైంది. 1990-91లో బల్లియాలోని సతీష్ చంద్ర కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2012లో తొలిసారి రస్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఉమాశంకర్ సింగ్ మృతి బీఎస్పీకి రాజకీయంగా పెద్ద లోటుగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement