లోకేశ్‌ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు | DSC Protest LIVE Updates And Key Headlines, YSRCPs Agitation Faces Police Action Across Andhra Pradesh, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు

Aug 6 2026 9:22 AM | Updated on Aug 6 2026 12:04 PM

DSC Protest LIVE Updates: YSRCPs Agitation Faces Police Action

డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్‌ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ పలు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.. 

YSRCP DSC Porubata Updates

ఏపీలో జంగిల్‌రాజ్‌

  • వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్‌ యత్నం

  • పోలీసుల సమక్షంలోనే కొనసాగుతున్న దౌర్జన్యకాండ

  • వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలు

  • కీలక నేతలు దీక్షా శిబిరాలకు వెళ్లకుండా అడ్డగింత

  • పోలీసుల సమక్షంలోనే దీక్షా టెంట్‌లను పీకేస్తున్న టీడీపీ శ్రేణులు

  • అడ్డుపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

  • పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలు

  • విజయవాడలో అమానుషం.. 

  • అత్యంత నీచంగా వ్యవహరించిన బోండా ఉమా అనుచరులు

  • దీక్షా శిబిరం పైనుంచి మూత్రం పోసిన బోండా అనుచరుడు

  • మహిళలపై సైతం దాడులకు పాల్పడుతున్న టీడీపీ రౌడీలు


బోండా ఉమా దౌర్జన్యం.. దాడికి యత్నం
డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ముత్యాలపాడులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు గుడ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. 

అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తత
డీఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు తొలగించారు. జేసీ వర్గీయుల కవ్వింపు చర్యలతో పాటు దౌర్జన్యం జరిగిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారని పేర్కొంది. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఏలూరు జిల్లాలో.. 
డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ కైకలూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన దీక్షలకు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పులివెందులలో.. 
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షలో కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులకు పూలమాలలు వేసి పార్టీ నేత వైఎస్‌ మధురెడ్డి దీక్షలను ప్రారంభించారు.

రేపల్లెలో ఉద్రిక్తత..
డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపల్లె తాలూకా సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీటా మోహన్‌కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో.. 
మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో..
డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో జెన్‌జీ నిరసనలు
తిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్‌-జెడ్‌ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్‌ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, స్పోర్ట్స్‌ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ జిల్లాలో..

2025లో జరిగిన డీఎస్సీ అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరం మండలానికి చెందిన విద్యార్థులు దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు.. 

  • నేటి నుండి వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

  • రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలు

  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని‌ డిమాండ్

  • ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్‌సీపీ

  • కలెక్టర్లకు వినతి పత్రాలు, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాలు సమావేశాలు

  • ఈరోజు నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు

  • ప్రభుత్వం‌ స్పందించకుంటే 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు నిర్ణయం

నంద్యాల జిల్లాలో.. 
ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్‌ చేశారు.

నెల్లూరు జిల్లాలో..
కోవూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు రజిత్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని కోరారు.

తిరుపతిలో భూమన నేతృత్వంలో దీక్షలు..
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నిరుద్యోగులు, పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

గురజాలలో పోలీసుల ఓవరాక్షన్

  • డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్‌లో రిలే దీక్ష 

  • దీక్షకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ యువజన విద్యార్థి విభాగం

  • దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులు

  • కనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులు

  • దీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులు

బాపట్ల జిల్లా వేమూరులో.. 

  • అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్

  • డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులు

  • దీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులు

  • అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

మాచర్లలో దీక్షకు అడ్డంకులు
పల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

గుంటూరులో టెంట్‌ తొలగింపు
గుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు. 

కనిగిరిలోనూ ఉద్రిక్తత
మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్‌ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్‌జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జి ధద్దాల నారాయణ యాదవ్‌ విమర్శించారు.

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రణభేరి
డీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్‌సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.

మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement