టీడీపీ నేత వద్ద ఆరు పులిగోర్లు లభ్యం! | TDP Leader Caught with Tiger Claws in Atmakur Nandyal District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత వద్ద ఆరు పులిగోర్లు లభ్యం!

Aug 6 2026 8:00 AM | Updated on Aug 6 2026 12:38 PM

  Tiger Claws In TDP leader

ఆత్మకూరు రూరల్‌: నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల మరణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పులిగోర్లతో ఒక వ్యక్తి పట్టుబడిన వార్త పెను సంచలనంగా మారింది. ఆరుగోర్లతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తి టీడీపీ నేతగా తెలుస్తోంది. 

ఆత్మకూరు డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ అపావ్‌ ఎట్టకేలకు తమకు ఆరు పులిగోర్లు లభ్యమైన విషయం వాస్తవమేనని, అనుమానితుడిని విచారిస్తున్నామని.. దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. బైర్లూటి రేంజ్‌ అధికారి కృష్ణప్రసాద్‌కు అందిన సమాచారం మేరకు ఆత్మకూరు పట్టణంలోని నేతాజినగర్‌లో ఒక ఇంటిపై తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.

ఆ ఇంటి సమీపంలో పార్క్‌ చేసిన ద్విచక్రవాహనంలో ఆరు పులిగోర్లు ఉన్న ప్యాకెట్‌ లభించినట్లు తెలుస్తోంది. వాహన యజమానిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఇతను టీడీపీ నేత కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఉన్నతస్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో వివరాలు వెల్లడించేందుకు అటవీ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి పొద్దుపోయాక అదుపులో ఉన్న టీడీపీ నేతను పిలిచినప్పుడు విచారణకు రావాలని వదిలేసినట్లు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement