దేవరపల్లి బస్టాండ్ రోడ్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలిన అశేష జనవాహినిలో ఓ భాగం
మీ పాలనలో కడుపు నిండుగా అన్నం తిన్నాం
చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయాం
మళ్లీ మీరొస్తేనే మా బతుకులు మారేది
పొగాకు వేలం కేంద్రంలో వైఎస్ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న రైతులు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం సార్.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు.. గిట్టుబాటు ధరా దక్కడం లేదు.. ఆత్మహత్యలే శరణ్యం సార్..’ అంటూ పొగాకు రైతులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం కారణంగా మద్దతు ధర దక్కక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
పొగాకుకు కనీస గిట్టుబాటు ధర దక్కక ఇక్కట్లు పడుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడానికి బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడగానే కష్టాలు ఏకరువు పెట్టారు. ‘ఈ పాలన ఏం బాగోలేదన్నా.. మీరొస్తేనే రైతు రాజ్యం వస్తుందన్నా.. మీ హయాం అన్నదాతలకు స్వర్ణ యుగం అన్నా..’ అంటూ తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతల ఆవేదన వారి మాటల్లోనే..

మీరొస్తున్నారని రూ.10 పెంచారు
పొగాకు రైతులు మిమ్మల్ని అమరావతిలో కలిశాక.. మీరు దేవరపల్లి వస్తున్నారని తెలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం కిలోకు రూ.10 మద్దతు ధర పెంచింది. అయితే గ్రేడింగ్ పేరిట వ్యాపారులు ఆ మేరకు అంటే రూ.10 తగ్గించేశారు. ఈ ప్రభుత్వ మాయాజాలం ఇలా ఉంటోంది. ప్రస్తుతం కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ ధర రూ.230 కూడా రావడం లేదు. ఎకరాకు రూ.3 లక్షలపైనే ఖర్చవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును సైతం కిలో రూ.230కే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సిండికేట్ వ్యాపారులకే మేలు జరుగుతోంది. సామాన్య రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – జక్కుల భద్రం, కౌలు రైతు, దేవరపల్లి
మన ప్రభుత్వంలో యావరేజ్ రూ.365
అన్నా.. మన ప్రభుత్వంలో దేవరపల్లి బోర్డు పరిధిలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.385 దక్కింది. యావరేజ్‌గా రూ.365 దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచేసుకుంటున్నారు. కిలోకు ఒక్కోసారి రూ.170 కూడా దక్కడం లేదు. గరిష్టంగా రూ.260 దాటడం లేదు. 20 ఎకరాల్లో పంట సాగు చేశాను. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాను. – సుంకవిల్లి వెంకట శ్రీనివాసరావు, సంగాయి గూడెం, దేవరపల్లి
‘వడ్డీ లేని రుణం’ పథకం తీసేశారు
మీరు దేవరపల్లి పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు హడావిడిగా రూ.50 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తానని ప్రకటించాడు. ఆ రూ.50 వేలు మూడేళ్లలో ఇస్తారంట. మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.లక్ష వడ్డీ లేకుండా రుణాలిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. రైతులు వ్యవసాయం మానేసేలా చేస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, గోపాలపురం
మీరొస్తేనే మంచి రోజులు
కేజీ పొగాకు సాగు చేసేందుకు రూ.300 ఖర్చవుతుంటే... ఇక్కడ యావరేజ్‌గా రూ.230కే కొంటున్నారు. లో గ్రేడ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గించేయమంటున్నారు. టొబాకో బోర్డు గతంలో ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లు కొంటామని చెప్పి.. ప్రస్తుతం 20 క్వింటాళ్లే కొంటామంటోంది. వచ్చే ఏడాది పది క్వింటాళ్లే కొంటామంటున్నారు. రైతులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా కోసం వచ్చారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి. – వైఎస్ జగన్‌తో పలువురు రైతులు


