వైఎస్ జగన్ పర్యటనకు యువత బ్రహ్మరథం
పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అన్నదాతలు
2.6 కిలోమీటర్ల దూరానికి రెండు గంటల సమయం
అడుగడుగునా అభిమానం అడ్డుపడటంతో ఆలస్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనకు ప్రజలు, యువత బ్రహ్మరథం పట్టారు. దేవరపల్లి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.29 గంటలకు దేవరపల్లి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పొగాకు వేలం కేంద్రానికి కేవలం 2.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ మాత్రం దూరానికి 2 గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున యువత, ప్రజలు, అభిమానులు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
పర్యటన సాగిన మార్గమంతా యువత, అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జన సంద్రమే కనిపించింది. దారిపొడవునా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. జగన్ పర్యటనకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది.

ఉరకలేసిన జెన్ జీ
వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జెన్‌జీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే ‘జై జగన్.. సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మిద్దెలు, చెట్లెక్కిన అభిమానం
వైఎస్ జగన్‌ను చూసేందుకు యువత, అభిమానులు చెట్లెక్కారు. మహిళలు మిద్దెలెక్కి మరీ జననేతను చూశారు. అడుగో.. జగన్.. అంటూ పిల్లలకు చూపించారు. జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.


