అనుమతులు లేకుండానే అడ్డగోలు తవ్వకాలు
రామస్థూపం ఉన్న కొండని రాత్రీపగలు తేడా లేకుండా తొలిచేస్తున్న కూటమి నేతలు
భద్రాచలం కంటే ముందుగా ఇక్కడ రాముడు సేదతీరాడని ప్రసిద్ధి
గుర్తుగా రామసూ్థపం నిర్మాణం
ఈ గుర్తులు చెరిగిపోయేలా కొండపై అక్రమ తవ్వకాలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో అరాచకం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రమైన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండపై అడ్డగోలుగా మైనింగ్ జరిపి.. వైఎస్సార్‌సీపీ పోరాటాలు, ప్రజా వ్యతిరేకతతో చాప చుట్టేసిన చంద్రబాబు కూటమి నేతలు.. ఇప్పుడు రాంబిల్లిలోని రాముడి కొండపై పడ్డారు. ఇక్కడ భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రాముడి పాదాల సాక్షిగా రావణ విధ్వంసం సృష్టిస్తున్నారు.
5 ఎకరాల్లో రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వేస్తూ వందలాది టిప్పర్ల గ్రావెల్ తరలించేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.12 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా శాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెపుతున్నట్లు సమాచారం. ఎన్నో ప్రకృతి విపత్తుల నుంచి తమను కాపాడిన రామకొండను అక్రమ మైనింగ్‌తో కనుమరుగు చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
రాముడు సేద తీరిన కొండ...!
రాంబిల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 142లో ఉన్న ఈ రామకొండకు చారిత్రకంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. శ్రీరాముడు భద్రాచలానికి వెళ్లే ముందు ఈ కొండపై సేద తీరాడని చెబుతారు. అందుకే ఈ కొండను రామ కొండ అంటారు. ఇందుకు గుర్తుగా కొండపై రామస్థూపం కూడా నిర్మాణమై ఉంది. పురావస్తుశాఖ కూడా ఈ స్థూపానికి గుర్తింపు ఇచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా రాంబిల్లిని గతంలో రాంపల్లి (రాముడి పల్లె అనే అర్థంలో) అని పిలిచేవారని, కాలక్రమంలో ఇది రాంబిల్లి అయ్యిందని కూడా చెబుతున్నారు.
ఎన్నో విపత్తుల నుంచి తమను ఈ కొండ కాపాడిందని వాడపాలెం గ్రామస్తులు తెలిపారు. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ కొండపై ఇప్పుడు చంద్రబాబు కూటమి గద్దల కన్ను పడింది. రాత్రీ పగలు తేడా లేకుండా భారీ పొక్లయిన్లతో ఇప్పటికే కొండలో పెద్ద భాగాన్ని తవ్వేశారు. మొన్నటివరకు ఇదే మండలంలోని శైవక్షేత్రమైన పంచదార్ల కొండలో అక్రమ తవ్వకాల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసి తన అల్లుడు ద్వారా రూ.10 కోట్ల మేర అక్రమ మైనింగ్ చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడుగుజాడల్లోనే.. రామకొండపైనా కూటమి నేతలు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అక్రమ తవ్వకాల ద్వారా ఇప్పటికే రూ. కోట్ల మేర ఆర్జించినట్టు చెబుతున్నారు. వీరి అక్రమ తవ్వకాలతో రామసూ్థపంతో పాటు రాముడి పాదాలకూ ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులకూ వాటా..!
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉన్న సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు భూమి చదును కోసం గ్రావెల్ అవసరం అవుతుంది. ఇదే అవకాశంగా చంద్రబాబు కూటమి నేతలు అక్రమార్జనకు తెరతీశారు. సాధారణంగా ఒక్కో ట్రిప్పు గ్రావెల్ ధర రూ. 8 వేల నుంచి రూ.10 వేలు ఉంటుంది. అయితే, ఇందులో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కూడా వాటాలు ఇవ్వాలంటూ ఒక్కో ట్రిప్పునకు రూ. 12 వేలు చొప్పున పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రతి ట్రిప్పునకు రూ. 2 వేలు చొప్పున రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, మైనింగ్ అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ 2 వేలల్లో ఏ శాఖ అధికారులకు ఎంతివ్వాలో కూడా వాటాలు వేసినట్లు సమాచారం. స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా మరో రూ.2 వేల చొప్పున ముట్టచెబుతున్నారు. అంటే రోజుకు వంద ట్రిప్పులు తరలిస్తే.. అధికారులకు రూ. 2 లక్షలు, ప్రజా ప్రతినిధికి రూ. 2 లక్షలు వస్తాయి. భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడానికి కారణం మామూళ్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.


