ఇందులో క్రీడాసంఘాలతో పాటు శాప్ కార్యాలయం పాత్ర కూడా ఉంది
అక్రమంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినవారిని డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కొందరు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించి డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినమాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం చెప్పారు. ఈ అక్రమాల్లో క్రీడాసంఘాలు ప్రతినిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయ అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీలో అనేక లోపాలు జరిగాయని చెప్పారు. పలు క్రీడాసంఘాలు ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.
శాప్‌లో క్రీడాసంఘాల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో వారు చెప్పినట్లే శాప్ కార్యాలయంలో అంతా జరుగుతోందని విమర్శించారు. అందువల్లే నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు గురించి శాప్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు పొందినవారి సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించాలని కోరారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డు మీద పండ్లు అమ్మిన రీతిలో క్రీడాసంఘాలకు చెందినవారు క్రీడలతో సంబంధం లేనివారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మారని, ఇది బహిరంగ రహస్యమేనని చెప్పారు. బిహార్‌లో ఇలాగే జరిగితే ఫేక్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని అక్కడి ప్రభుత్వం డిస్మిస్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిందని, ఏడేళ్ల జీతాలను కూడా రికవరి చేసిందని తెలిపారు.
శాప్‌ను ప్రక్షాళన చేయాలి
శాప్‌లో వివిధ క్రీడాసంఘాల వారి ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. శాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సూచించారు. సమర్థులైన అధికారులను, క్రీడాస్ఫూర్తి ఉన్న వారిని శాప్ చైర్మన్, డైరెక్టర్లుగా నియమిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడాసంఘాలపైన నిషేధం విధించాలని, నకిలీ సర్టిఫికెట్లను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించిన శాప్ అధికారులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఆపరేషన్ గాండీవం అమలులో అవినీతి జరిగిందని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పారు.


