న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబు దాడికి పన్నాగం పన్నిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ మద్దతుగల ఉగ్రవాద మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉగ్రదళానికి చెందిన సభ్యులు నిరసన సమయంలో జంతర్ మంతర్‌ను సందర్శించి, రవాణా సాయం అందుకోవడంతో పాటు పెట్రోల్ బాంబులను కూడా సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులను, ఇతర యూనిఫాం ధరించిన అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు నిందితులకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ దాడిని అమలు చేయడం సాధ్యపడకపోవడంతో, అనుమానితులు పంజాబ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత నిఘా వర్గాల ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అమృత్‌సర్‌లో ఐఎస్‌ఐ మద్దతుగల రెండు సరిహద్దు ఉగ్రవాద మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మూడు అక్రమ పిస్టల్స్, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు స్థానిక యువకులను ఉగ్ర కార్యకలాపాల కోసం నియమించుకోవడం, భద్రతా స్థావరాలపై నిఘా పెట్టడం, అక్రమ ఆయుధాలను సమకూర్చడం వంటి పనులకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రైల్వే ట్రాక్‌ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ ఫుటేజ్‌ను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అమృత్‌సర్‌లోని మోకంపుర, ఎయిర్‌పోర్ట్, సి-డివిజన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుసంధానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ!


