డబ్బుల్లేవా? అయితే చచ్చిపో! | Surat Friendship Turned Fatal: Man Dies By Suicide After Betrayal and Extortion By Friends | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవా? అయితే చచ్చిపో!

Aug 5 2026 9:26 AM | Updated on Aug 5 2026 10:16 AM

Friendship Turned Fatal: Surat Man Dies After Betrayal by Friends

స్నేహం అంటే నమ్మకం.. కష్టాల్లో అండగా నిలిచే బంధం. కానీ అదే ఓ వ్యక్తి జీవితంలో విషాదానికి కారణమైంది. నమ్మినవాళ్లే మోసం చేయడం, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, పైగా బెదిరింపులకు దిగడంతో.. అంతకు మించి అవమానించడంతో ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. చివరకు తన ప్రాణాలనే తీసుకున్నాడు. 

గుజరాత్‌ సూరత్‌లోని సార్థానా ప్రాంతానికి చెందిన రాజేశ్‌భాయ్‌ కుంజాడియా ఎంబ్రాయిడరీ వ్యాపారం చేసేవారు. గత కొన్ని నెలలుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో తన స్నేహితులకు అవసరాలు పడడంతో.. తన దగ్గరున్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు. అయితే ఆ నమ్మకం వమ్ము కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 

రాజేశ్‌భాయ్‌ తన స్నేహితుడు ఘనశ్యామ్‌ అహిర్‌కు కెనడా వెళ్లేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.14 లక్షలు ఇచ్చారు. కొంతకాలం తర్వాత డబ్బు తిరిగి అడిగినప్పుడు ఘనశ్యామ్‌ తప్పించుకోవడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రాజేశ్‌భాయ్‌ పేరుతో పలు బ్యాంకు ఖాతాలు తెరవాలని ఒత్తిడి చేశాడు. ఎందుకు? అని గట్టిగా ఆరా తీస్తే.. సైబర్‌ నేరాలకు ఉపయోగించే ‘మ్యూల్‌ అకౌంట్స్‌’ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్‌భాయ్‌ అభ్యంతరం చెప్పడంతో తనను సైబర్‌ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడరు. అదే సమయంలో.. 

మరో ఇద్దరు స్నేహితులు నికిత్‌ అలియాస్‌ రిక్కీ, దాధీ అహిర్‌లకు కూడా ఆయన డబ్బు ఇచ్చారు. ఒకరికి రూ.2 లక్షలు, మరొకరికి రూ.1.32 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి వద్ద కలిపి రాజేశ్‌భాయ్‌కు రావాల్సిన మొత్తం రూ.17.32 లక్షలు. ఆ ముగ్గురు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. స్నేహితులు తనను అవమానించారని, ఒత్తిడి చేశారని రాజేశ్‌భాయ్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. “డబ్బుల్లేవా? అయితే చచ్చిపో” అంటూ వారు చెప్పడంతో రాజేశ్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

జులై 30న రాజేశ్‌భాయ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి.. తన కుమార్తెతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కుమార్తెను తిరిగి ఇంటికి పంపించి విషం తీసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు.

మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్‌ నోట్‌, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నేహితుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని గుర్తించి.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. ఫ్రెండ్‌షిప్‌ డే రోజే(ఆగస్టు 2న) ఘనశ్యామ్‌, నికిత్‌, దాధీ అహిర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేస్తే ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement