మళ్లీ అదే స్టేషన్‌.. 12 ఏళ్ల తర్వాత పునరావృతమైన ఘటన | Action Taken Against Three Constables In YSR District | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే స్టేషన్‌.. 12 ఏళ్ల తర్వాత పునరావృతమైన ఘటన

Aug 5 2026 8:27 AM | Updated on Aug 5 2026 8:31 AM

Action Taken Against Three Constables In YSR District

కానిస్టేబుళ్లు సాయికిశోర్, శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్‌ బాలదస్తగిరి

ప్రొద్దుటూరు క్రైం : వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ముగ్గురు పోలీస్‌ సిబ్బందిపై జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ వేటు వేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ దస్తగిరి, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, సాయికిశోర్‌లను కడప వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా మంగళవారం ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ముగ్గురు పోలీసు సిబ్బంది కడప హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేసుకున్నారు. 

ఇటీవల ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్‌ సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను.. బెదిరించి వారి నుంచి వన్‌టౌన్‌ పోలీసు సిబ్బంది డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళల నుంచి నేరుగా నగదు తీసుకోకుండా ఓ వ్యక్తి పోన్‌పే ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలు రావడంతో.. పోలీసు సిబ్బందిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. డిజిటల్‌ లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ.. అన్ని కోణాల్లో పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇందులో ఆరోపణలు రుజువైతే తరుపరి శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు సిబ్బందిపైనే ఈ తరహా మహిళల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలను బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రుజువైతే అది కేవలం పోలీసుశాఖకు మచ్చ మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఫోన్‌పే చెల్లింపులతో అడ్డంగా దొరికిపోయారు 
ఫోన్‌పే చెల్లింపులతో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. డిజిటల్‌ చెల్లింపులు నేరాల విచారణలో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. తాజాగా వ్యభిచారం కేసులో మహిళ నుంచి ఫోన్‌పే ద్వారా జరిగిన రూ.50 వేల బదిలీ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. నగదు చేతులు మారి ఉంటే ఈ వ్యవహారం బయటపడేదో లేదో కానీ ఫోన్‌పే ద్వారా జరిగిన ట్రాన్షక్షన్‌ మాత్రం మొత్తం వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. డిజిటల్‌ ట్రాన్షక్షన్‌కు సంబంధించిన ఆధారాలే విచారణలో కీలకంగా మారడంతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది.  

12 ఏళ్ల తర్వాత అదే స్టేషన్‌లో.. 
సరిగ్గా 12 ఏళ్ల క్రితం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఒక వ్యభిచారం కేసులో ఆరుగురు సిబ్బందిపై వేటు పడింది. పలువురు పోలీసులు వ్యభిచార నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై నాటి పోలీసు అధికారులు.. ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. కాగా అప్పుడు కూడా ఆగస్టు నెలలోనే పోలీసు సిబ్బందిపై వేటుపడటం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు కానిస్టేబుళ్లు వ్యభిచారం వ్యవహారంలోనే ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్‌కు వెళ్లారు. దీంతో ‘నాడు ఆరుగురు.. నేడు ముగ్గురంటూ’ పలువురు పోలీసులు అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.  

డయల్‌ 100 కాల్‌కు విలువ లేదా? 
పోలీసుశాఖలో డయల్‌ 100 కాల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డయల్‌ –100 వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా తాజా ఘటన చర్చకు దారి తీసింది. డయల్‌– 100కు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందే.. మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందనే సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే డయల్‌–100 వ్యవస్థ విశ్వసనీయతమైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. డయల్‌ 100 కాల్‌కు వెళ్లిన వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.  

వ్యభిచార నిర్వాహకుడిపై చర్యలేవీ? 
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. డబ్బులు తీసుకున్నారనే దానిపైనే ఇంత వరకు చర్చ జరుగుతూ వచ్చింది. అయితే వ్యభిచార నిర్వాహకుడి గురించి ఎక్కడా మచ్చుకైనా ప్రస్తావన రాలేదు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లే సరికి మహిళలు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారని.. ఇంటి బయటే వారిని విచారణ చేయడం, తదితర పరిణామాలు చేసుకున్నాయని పోలీసు అధికారులు చెబుతున్న మాట. 

అయితే ఆ ప్రాంత వాసులు తెలిపే వివరాల ప్రకారం.. బైపాస్‌ రోడ్డులో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కొందరు నాయకుల అండతో వ్యభిచారం, జూదం నిర్వహిస్తున్నాడు.. అతనే మహిళలను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. అతను ఆ ప్రాంతంలోని ఓ నాయకుడి అండతో గలీజు దందా కొనసాగిస్తున్నాడని, సదరు వ్యక్తి గురించి పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం వ్యవహారంలో కూడా అతనే సెటిల్‌మెంట్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement