ఎన్నికల సన్నద్ధతపై నేడు కీలక సమావేశం
డీపీవోలు, జడ్పీ సీఈవోలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష
13,151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులూ లేవు
నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ యోచన
ఒక రెవిన్యూ డివిజన్ అంతా ఒకే రోజు ఎన్నికలు జరిపేలా ప్రణాళిక
ప్రత్యేక పోర్టల్ రూపొందించిన ఎన్నికల సంఘం
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలపై రేపు సమావేశం..
సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలయ్యినట్లు కనిపిస్తోంది. సర్పంచి ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం అన్ని జిల్లాల డిపీవోలు, ఆయా జిల్లాల జడ్పీ సీఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు నెలల క్రితమే సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగు తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలు ఉండగా, 13,151 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేనట్టు పంచాయతీరాజ్ శాఖ తేల్చింది. 2021 ఫిబ్రవరి– మార్చి నెలలో ఎన్నికలు జరిగి ఇటీవల పదవీ కాలం ముగిసిన 13,100 గ్రామ పంచాయతీలతో పాటు అప్పట్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ఆగిపోయిన మరో 51 చోట్ల ఎన్నికల నిర్వహణకు ఏ అడ్డంకులూ లేవని అధికారులు తేల్చారు.
విలీన పంచాయతీల్లో పూర్తికాని ప్రక్రియ..
పట్టణాలకు సమీపంలో ఉండే 185 గ్రామ పంచా యతీలను ఆయా మున్సిపాలిటీలు, నగర కార్పొ రేషన్ విలీనానికి మున్సిపల్ శాఖ ప్రతిపాదిస్తూ ఆయా చోట్ల సర్పంచి ఎన్నికలు ఆపాలని కోరడంతో వాటిలో అప్పట్లో ఎన్నికలు జరగలేదు. అయితే,ఆ తర్వాత వాటిలో దాదాపు 40కి పైగా గ్రామ పంచా యతీల విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. ఆయా గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి మున్సిపల్ శాఖ అప్పట్లో జారీ చేసిన ఆదేశాలను ఉప సంహరించుకునే పక్షంలో ఆయా చోట్ల ఎన్ని కలకు ముందుకెళ్లే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే బుధ వారం అన్ని జిల్లాల డిపీవోలు, ఆయా జిల్లాల జడ్పీ సీఈవోలతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ కూడా పూర్తికావడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా జిల్లాల వారీగా తయారు చేసి అందజేయా లని ఆయా జిల్లాల డీపీవోలకు, జడ్పీ సీఈవోలకు ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో...
మరోవైపు, పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలంతో పాటు మున్సిపాలిటీలలో చైర్మన్, నగర కార్పొరేషన్లలో మేయర్‌ల పదవీ కాలం ఇప్పటికే ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారుల సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్ పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు ఎస్‌ఈసీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు..
గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జర పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో ఒకే రోజున ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్ మొదలు నామి నేషన్ ప్రక్రియ, అభ్యర్ధుల వివరాలు, పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వరకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్టు ఎస్‌ఈసీ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో అడ్డ గింతలు వంటి దౌర్జన్యాల కట్టడికి ఆన్‌లైన్ ప్రక్రియ కొంత మేర దోహదపడుతుందని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.


