ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.
ముఖ్యంగా పొగాకు ధరలు, వేలం ప్రక్రియ ఎలా జరుగుతోందనే అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత నెల 22న వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించిన రైతులు, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు.
రైతుల విజ్ఞప్తి మేరకు ఈరోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు.


