ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికీ ధర నిర్ణయించుకునే హక్కు ఉత్పత్తిదారుకు ఉంటుంది. కానీ, రైతు పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని, భారీగా పెట్టుబడి పెట్టి.. చంటిబిడ్డలా పంటను సాకి.. దండిగా దిగుబడులు సాధించినా.. దానికి ధర నిర్ణయించుకునే హక్కు మాత్రం అతడి చేతిలో లేకుండా పోతోంది. దళారులు, మార్కెట్ శక్తులు పంట ధరలను శాసిస్తూ రైతన్న బతుకుతో చెలగాటమాడుతున్నాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు చిత్తవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పొగాకుకు కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.. రకరకాల సాకుల తో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తున్నాయి.. వేలం కేంద్రానికి తీసుకెళ్తున్న బేళ్లను తిరస్కరి స్తున్నాయి.. రైతుల వద్ద భారీగా నిల్వలు పేరుకుపో తున్నాయి.. వాతావరణ మార్పులతో ఆకు నాణ్యత దెబ్బ తింటోంది.. ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పొగాకు రైతులు పుట్టెడు కష్టాల్లో చిక్కుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఏటా ఆగస్టు నెలాఖరుకే పొగాకు కొనుగోళ్లు పూర్తవుతూండగా.. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వచ్చినా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నాయి తప్ప, రైతుకు లాభసాటి ధర దక్కేలా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఉత్తర తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్) 2025–26 పంటకాలంలో 12,938 మంది రైతులు 30,145 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. రీజియన్‌లోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిల్లోని వేలం కేంద్రాల్లో మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 96 రోజులు వేలం నిర్వహించగా 11 శాతం మాత్రమే పొగాకు విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం కిలో సగటు ధర రూ.237 మాత్రమే పలుకుతోంది. ఈ ధర రూ.350 పలికితే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందని రైతులు ఆశ పడుతున్నారు. కానీ, ఆ సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.
రైతుల వద్ద భారీగా నిల్వ
ఈ పరిస్థితుల్లో ఒక్కో రైతు వద్ద ఉన్న రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పొగాకు నిల్వ ఉండిపోవడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతి ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ తీసి, వివిధ దేశాల్లోని సిగరెట్ల తయారీ సంస్థలకు పంపించినప్పటికీ ఆర్డర్లు ఖరారు కాలేదు. దీంతో, కొనుగోళ్ల ప్రక్రియ వచ్చే జనవరి వరకూ నిర్వహించనున్నట్లు సమాచారం. కొనుగోళ్ల ప్రక్రియ నెలల తరబడి సాగితే పొగాకు నాణ్యత మరింత దెబ్బ తిని, నష్టాల్లో కూరుకుపోతామని గగ్గోలు పెడుతున్నారు. మార్కె ట్లో సంక్షోభం నెలకొని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వెంటనే గిట్టుబాటు ధరకు మొత్తం పొగాకు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎకరాకు రూ.3 లక్షల పెట్టుబడి
ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ రైతులు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో అంతంత మాత్రంగానే ధర లభిస్తూండటంతో ఎకరాకు రూ.1.60 లక్షల వరకూ నష్టం వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. రైతులు వేలానికి తెచ్చిన బేళ్లను కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో, సాగుకు తెచ్చి న అప్పులకు నెలల తరబడి వడ్డీలు చెల్లించలేక రైతు లు సతమతమవుతున్నారు. కౌలు రైతులైతే మరింత కుదేలయ్యారు. ఎకరం కౌలు రూ.70 వేలు కాగా, బ్యారన్ అద్దె రూ.2.50 లక్షలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు కలిపి వారికి రూ.4.70 లక్షలు ఖర్చవుతోంది.
అండగా నిలిచిన తండ్రీతనయులు
2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కలి్పంచి, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయించారు.వైఎస్సార్ తనయుడు, 2014లో నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరులోని బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని ప్రకటించారు. అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరగడంతో రైతులకు మేలు జరిగింది.
పొగాకు రైతులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గతంలో 2021 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. నాడు పొగాకు రైతుల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌కు ఏకంగా రూ.500 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయించారు.
నేడు దేవరపల్లిలో జగన్ పర్యటన
పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం పర్యటించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తారు. పొగాకు సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, తదితర సమస్యలపై రైతులతో నేరుగా మాట్లాడతారు. జగన్ తాడేపల్లిలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి, 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు.
పురుగులు పడుతున్నాయి
నెలల తరబడి పొగాకు ఇంటి వద్ద నిల్వ ఉండిపోవడంతో నాణ్యత దెబ్బ తిని, బేలు మధ్య బూజు పట్టి పురుగులు పడుతున్నాయి. 50 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. 10 శాతం అమ్మగా, ఇంకా 90 శాతం ఇంటి వద్దనే ఉంది. 20 శాతం లో గ్రేడ్, 40 శాతం మీడియం, 40 శాతం బ్రైట్ గ్రేడ్ పొగాకు పండుతుంది. లో, మీడియం గ్రేడ్ పొగాకు అమ్ముడు పోవడం లేదు.
– పరిమి రాంబాబు, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. 80 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. గిట్టుబాటు ధర లేదు. ఎక్కడి పొగాకు అక్కడే ఉంది. కిలో సగటు ధర రూ.350 ఇస్తే కనీసం ఖర్చులు వస్తాయి.
– వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు,
వెదుళ్లకుంట, గోపాలపురం మండలం



