పాకిస్థాన్ గడ్డపై గత కొద్ది సంవత్సరాలుగా ఓ రహస్య పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, రక్షణ రంగ నిపుణులను నివ్వెరపరుస్తున్న ఈ ఉదంతంలో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన పలువురు కీలక ఉగ్రవాదులు వరుసగా నేలకూలుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జరుగుతున్న ఈ మరణాలు ఉగ్రవాద శిబిరాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.
అజ్ఞాత హంతకుల అటాక్..
పాకిస్థాన్‌లోని పంజాబ్, కరాచీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీవోకే ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వచ్చే అజ్ఞాత వ్యక్తులు అత్యంత సమీపంలోకి వచ్చి కాల్పులు జరిపి నిమిషాల వ్యవధిలో మాయమవుతున్నారు. ఈ మిస్టరీ హత్యలు పాక్ నిఘా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
లష్కర్ సీనియర్ నేత సంచలన ప్రకటన
సరిహద్దు అవతల నుంచి పనిచేసే లష్కర్ ఏ తోయిబా సీనియర్ సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఇటీవల సంచలన వాస్తవాన్ని బయటపెట్టాడు. 2020 నుంచి ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లో హతమయ్యారని బహిరంగంగా అంగీకరించారు. ఒక ఉగ్రవాద సంస్థ ఈ స్థాయిలో నష్టాన్ని అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వరుస హతం
ఈ మిస్టరీ దాడుల్లో భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎంతో మంది కీలక టెర్రరిస్టులు అంతమొందారు. 2016 పఠాన్‌కోట్ దాడి సూత్రధారి మౌలానా షాహిద్ లతీఫ్, 1999 ఐసీ-814 విమాన హైజాక్ నిందితుడు జహూర్ మిస్త్రీ, హిజ్బుల్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ వంటి ప్రముఖులు వేర్వేరు సందర్భాల్లో విగతజీవులుగా మారారు.
అంతర్జాతీయంగా చర్చనీయాంశం
పాక్‌లో జరుగుతున్న ఈ లక్షిత హత్యలను అంతర్జాతీయ మీడియా సంస్థలు మిస్టరీ కిల్లింగ్స్‌గా అభివర్ణించాయి. ఈ ఘటనల వెనుక విదేశీ ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్థాన్ అధికారులు అప్పుడప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, వాటికి తగిన ఆధారాలు చూపలేకపోయాయి. మరోవైప పాక్ భూభాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అణచివేయాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది.
అందుబాటులో లేని అధికారిక జాబితా
లష్కర్ సీనియర్ నేత 30 మందికి పైగా హతమైనట్లు ప్రకటన చేసినప్పటికీ, ఆ మృతుల పూర్తి అధికారిక జాబితాను ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా పాక్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. కేవలం పబ్లిక్ డొమైన్‌లో లభిస్తున్న విశ్వసనీయ సమాచారం, ప్రాథమిక రికార్డుల ఆధారంగానే కొన్ని ప్రధాన పేర్లు వెలుగులోకి వచ్చాయి.
మిస్టరీ వీడని హత్యలు.. ఉగ్రశిబిరాల్లో దడ
అబూ ఖతాల్ సింధి, ఖాలిద్ రజా, సలీమ్ రెహమానీ వంటి కీలక ఉగ్రవాదుల హత్యల కేసుల దర్యాప్తు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుల ఆచూకీ లభించకపోవడం, వరుస హత్యల పరంపర కొనసాగుతుండటంతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శ్రేణుల్లో కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ రాజకీయాల్లో సునామీకి షేఖ్ హసీనా సిద్ధం!


