గాజాలో వెలికితీసిన 112 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు
డెయిర్ అల్ బాలాహ్ (గాజా సిటీ): ఇజ్రాయె ల్ దమనకాండకు బలై మూడేళ్లుగా జాడ తెలీకుండా పోయిన తమ వారి కోసం ఆప్తుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గాజాలోని సబ్రా సమీప ప్రాంతంలోని జనావాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హసై నా, అబూ షరీయాలకు చెందిన కుటుంబా లు సజీవసమాధి అయ్యాయి. అయితే ఆనా టి నుంచి మృతదేహాల జాడ కోసం గాలించి ఇటీవల ఎట్టకేలకు గుర్తించారు. 2023 నవంబర్ 22నాటి ఇజ్రాయెల్ దాడిలో 300 మంది దాకా గల్లంతుకాగా వీరిలో తాజాగా 112 మందికి చెందిన మృతదేహాలను వెలికితీశా రు.
మృతదేహాలకు బంధువులు, ఆప్తులు మంగళవారం సామూహిక అంత్యక్రియలు జరిపారు. ఘటన జరిగిన రోజూ కాంక్రీట్, నిర్మాణ శిథిలాల్లో శరీరభాగాలు తెగిపోయిన స్థితిలో 40 మంది మృతదేహాలను వెలికితీయగా ఇప్పుడు ఒకేసారి 112 మంది బాధితుల అవశేషాలను బయటకుతీశామని హమాస్ సారథ్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో పాత శిథిలాల వద్ద తవ్వకం పనులు సాధ్యమయ్యాయి. దాంతో వీళ్ల మృతదేహాలను వెలికితీయగలిగారు. ఇంకా 157 మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది. 2023 అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ మొదలెట్టిన మారణహోమంలో గాజాలో ఇప్పటిదాకా 73,377 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.


