మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు! | Meta Under Fire: India Demands Answers Over PM Modi Video Takedown on Facebook | Sakshi
Sakshi News home page

మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!

Aug 5 2026 9:03 AM | Updated on Aug 5 2026 10:44 AM

Meta Under Fire: India Demands Answers Over Modi Video Takedown

సోషల్‌ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా.. దీనిని “టెక్నికల్‌ ఎర్రర్‌”గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా.. మెటా పనితీరు, అల్గారిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది.

ఈ క్రమంలో మెటా గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ జోయెల్‌ కప్లాన్‌ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచినట్లు సమాచారం. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం జరిగే సమావేశానికి ఇన్‌స్టాగ్రామ్‌ టెక్నికల్‌ టీమ్‌ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా అల్గారిథంలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ కంటెంట్‌ను తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన “టెక్నికల్‌ గ్లిచ్‌”పై మెటా నుంచి లిఖితపూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్లు సమాచారం.

అసలు వివాదం ఏంటి?
జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జెన్‌-జెడ్‌ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియోలో పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పోస్టు చేసిన ఈ వీడియోను కొంతకాలం తర్వాత ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారు.

దీనిపై స్పందించిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఆటోమేటెడ్‌ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే వీడియో తొలగించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి సంబంధించిన కంటెంట్‌ కూడా అల్గారిథంల నిర్ణయాల్లో చిక్కుకోవడం టెక్‌ సంస్థల జవాబుదారీతనంపై కొత్త చర్చకు దారితీసింది.

‘టెక్నికల్‌ ఎర్రర్‌’తో సరిపెట్టుకోవద్దు
సోషల్‌ మీడియా సంస్థలు కోట్లాది పోస్టులను పరిశీలించేందుకు ఆటోమేటెడ్‌ అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అయితే కొన్నిసార్లు సరైన కంటెంట్‌ కూడా పొరపాటున తొలగించబడుతోందనే విమర్శలు ఉన్నాయి. 

2016లో వియత్నాం యుద్ధానికి సంబంధించిన పులిట్జర్‌ అవార్డు పొందిన ప్రసిద్ధ ఫొటోను ఫేస్‌బుక్‌ తొలగించింది. నగ్నత్వ నిబంధనల ఉల్లంఘనగా అల్గారిథం గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్‌బుక్‌ తన నిర్ణయం తప్పని అంగీకరించింది. తాజాగా మోదీ వీడియో ఘటనలోనూ మళ్లీ “టెక్నికల్‌ సమస్య”నే కారణంగా చెప్పడం.. అల్గారిథంల పారదర్శకతపై ప్రశ్నలు పెంచుతోంది.

పార్లమెంట్‌ కమిటీ కూడా ప్రశ్నలు
మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. సోమవారం జరిగిన సమావేశంలో మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం.

ఐటీ కమిటీ ఛైర్మన్‌, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఈ ఘటనపై స్పందిస్తూ.. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన అంశం. అవసరమైతే మెటాకు లభిస్తున్న “సేఫ్‌ హార్బర్‌” రక్షణపై కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మెటా కొత్త భద్రతా చర్యలు
ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ఖాతాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని మెటా కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని వంటి హైప్రొఫైల్‌ ఖాతాలకు సంబంధించిన పోస్టులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులపై చర్య తీసుకునే ముందు సీనియర్‌ అధికారులు సమీక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు మెటా వెల్లడించింది. కనీసం ఇద్దరు సీనియర్‌ అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.

అల్గారిథంల వెనుక దాక్కోవద్దు
టెక్‌ సంస్థలు తమ అల్గారిథంలను ఒక “బ్లాక్‌ బాక్స్‌”లా ఉంచుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఏ పోస్టు ఎందుకు తొలగించబడుతుంది? ఏ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాల్లో పారదర్శకత తక్కువగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని వీడియో తొలగింపు ఘటనను కేవలం సాంకేతిక లోపంగా కాకుండా.. డిజిటల్‌ వేదికలపై జవాబుదారీతనం పెంచేందుకు వచ్చిన అవకాశంగా భారత్‌ చూస్తోంది. క్షమాపణలతో సమస్య ముగియదని.. అల్గారిథంల నిర్ణయాలకు టెక్‌ సంస్థలు బాధ్యత వహించాల్సిందేననే డిమాండ్‌ బలపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement