కర్ణాటక కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.
మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.
ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్‌సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.
మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది.


