19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ | Cabinet expansion in Karnataka: 19 new ministers inducted | Sakshi
Sakshi News home page

19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

Aug 4 2026 1:48 AM | Updated on Aug 4 2026 1:48 AM

Cabinet expansion in Karnataka: 19 new ministers inducted

నూతన మంత్రివర్గంతో కర్ణాటక గవర్నర్‌ గెహ్లాట్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

సీఎం డీకేతో కలిపి 33కు చేరిన మంత్రివర్గ సభ్యులు 

కార్యక్రమానికి హాజరుకాని సిద్ధరామయ్య

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఆశావహులు ఎంతో ఆశతో ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. బెంగళూరు లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం 19 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. జూన్‌ 3వ తేదీన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో పడుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో కేబినెట్‌ విస్తరణకు మార్గం సుగమం అయింది. జూన్‌ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. 

ఆయనతో పాటు అదే రోజు మొత్తం 13 మంది నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 33కు చేరింది. సిద్ధరామయ్య మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34 కావడం గమనార్హం. కాగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న దాదాపు 19 మంది డీకే మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. సీనియారిటీ, పలుకుబడికి జాబితాలో ప్రాధాన్యత లభించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, బీజేపీ, జేడీఎస్‌ నేతలు గైర్హాజరయ్యారు.  

చివరి క్షణంలోనూ మార్పులు.. చేర్పులు 
తాజామంత్రివర్గ విస్తరణ జాబితాలో తొలుత ఒక మహిళ పేరు ఉన్నప్పటికీ.. అటు తర్వాత వేరొకరితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం గమనార్హం. దీనితో డీకే మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి నెలకొంది. చివరి మూడు గంటల్లోనే మూడు సార్లు మంత్రులు, స్పీకర్‌ అభ్యర్థుల జాబితా మారడం గమనార్హం. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడను చివరి నిమిషంలో తప్పించి తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే తొలి జాబితాలో మహంకాళు వైద్య పేరు ఉంటే, దీనిని తొలగించి తాజా మాజీ మంత్రి ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌తో భర్తీ చేశారు. తమకు తాజా విస్తరణలో చోటు లభించకపోవడంతో పలువురు సీనియర్లు, ఆశావహులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు ఏకంగా శాసన సభ్యత్వానికే రాజీనామా సమరి్పస్తామని బెదిరించే వరకూ పరిస్థితి వెళ్లింది. అయితే అసమ్మతిని సహించబోమని అధిష్టానం స్పష్టం చేసింది.  

కొత్తగా మంత్రివర్గంలో చేరిన 19 మంది మంత్రులు..  
1. డాక్టర్‌ అజయ్‌సింగ్, 2. హెచ్‌సీ బాలకృష్ణ, 3. కేఎస్‌ బసవంతప్ప, 4. బసవ రాజరాయరెడ్డి, 5. ఎన్‌.చలువరాయస్వామి, 6. లక్ష్మణ సవది, 7. సారెకొప్ప మధు బంగారప్ప, 8. ఎస్‌ఎస్‌.మల్లికార్జున్, 9. బి.నాగేంద్ర, 10. నరేంద్ర స్వామి, 11. పుట్టరంగశెట్టి, 12. టి.రఘుమూర్తి, 13. రిజ్వాన్‌ అర్హద్, 14. రుద్రప్ప లమాణి, 15. సంతోష్‌ ఎస్‌.లాడ్, 16. కేఎం శివలింగేగౌడ, 17. శివరాజ్‌ తంగడగి, 18. విజయానంద కాశప్పనవర్, 19. జమీర్‌ అహ్మద్‌ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement